- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాడలేని వర్షాలు.. దంచికొడుతున్న ఎండలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అసలైన వర్షాలు కురవడం లేదు.

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అసలైన వర్షాలు కురవడం లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఆకాశం మేఘావృతమై, కేవలం ముసురు వాతావరణం మాత్రమే కనిపిస్తోంది కానీ, పంటలకు ప్రాణం పోసే ఒక్క భారీ వర్షం కూడా పడకపోవడం గమనార్హం. జులై మాసం వచ్చినా పరిస్థితి మారకపోవడంతో వర్షాధార పంటలపై ఆధారపడిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర వాయుగుండం.. అయినా వానల్లేవ్!
నిజానికి రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఒక వాయుగుండం ఏర్పడింది. అది తీరం దాటిన తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆయా ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో కుండపోతగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఏమాత్రం లేకపోవడం గమనార్హం. ఒకవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు ముంచెత్తి జనజీవనం అస్తవ్యస్తం అవుతుంటే, తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆ ముప్పు లేకపోయినా, కనీస వర్షాలు కూడా అందడం లేదు.
దంచికొడుతున్న ఎండలు
వర్షాలు లేకపోగా, తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణంగా జులై మాసంలో వాతావరణం చల్లబడాలి, కానీ మంగళవారం ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 39 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. రుతుపవనాల కాలంలో మే నెల తరహా ఎండలు దంచి కొడుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఆవేదనలో రైతన్న
నెల రోజులు గడుస్తున్నా సరైన వర్షాలు పడకపోవడంతో రైతులు సాగు పనులు మొదలుపెట్టలేక వేదన చెందుతున్నారు. విత్తనాలు వేయడానికి తగినంత పదును భూమిలో లేకపోవడంతో ముహుర్తాలు దాటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రైతాంగాన్ని ఆదుకునేలా.. బంగాళాఖాతంలో తదుపరి ఏర్పడే సిస్టమ్స్ అయినా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తాయేమోనని వాతావరణ శాఖ అంచనాలపై ఆశలు పెట్టుకున్నారు.






