పక్కదారి పడుతున్న యూరియా బస్తాలు

by Jakkula.Mamatha |

వర్షాకాలం సీజన్ మొదట్లోనే రైతులు మోసాలకు గురవుతున్నారు.

పక్కదారి పడుతున్న యూరియా బస్తాలు
X

దిశ, చేర్యాల: వర్షాకాలం సీజన్ మొదట్లోనే రైతులు మోసాలకు గురవుతున్నారు. వానాకాలం పంటలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతులకు వర్షాలు ఆలస్యం కావడంతో తీవ్ర నిరాశలో ఉండగా, మరోవైపు ఎరువుల విక్రయంలో ఫర్టిలైజర్ షాపుల యజమానులు రైతులను నట్టేట ముంచుతున్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్క యూరియా బస్తా పై రూ/- 266 ఎమ్మార్పీ ఉండగా 285 రూపాయలకు రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. కాగా ఫర్టిలైజర్స్ షాపుల యజమానులు సిండికేట్ అయ్యి ఒక్కో బస్తా రూ.320 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. అయితే బిల్లులు దొరకకుండా జాగ్రత్త పడుతున్న దుకాణ యజమానులు రైతులకు ఇచ్చిన రూపాయలు చిట్టీల పైన రాకుండా బస్తాల సంఖ్య మాత్రమే రాసి గోదాముల వద్దకు పంపుతున్నారు.

రైతులకు వివిధ రకాల షరతులను విధించి పరిమిత సంఖ్యలో యూరియా బస్తాలు విక్రయించే ఫర్టిలైజర్స్ దుకాణ యజమానులు రికార్డులలో నిల్వ ఉన్నట్లుగా చూపించి బస్తాలను అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇదే తరహా వ్యవహారం చేర్యాల పట్టణ కేంద్రంలోని ఓ దుకాణం యజమాని 5 వేల యూరియా బస్తాలు అక్రమంగా విక్రయించగా గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు అతని పైన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రభుత్వం సరఫరా చేసే యూరియాలోనే ఇంత పెద్ద మొత్తంలో రైతులను మోసం చేస్తున్న దుకాణాలు వివిధ రకాల ప్రైవేటు కంపెనీల సీడ్స్ విత్తనాలు, పిచికారి మందుల పైన ఎలాంటి మోసాలకు పాల్పపడుతున్నారో అనే భయం రైతుల్లో నెలకొంది. ఇప్పటికైన సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఫర్టిలైజర్స్ దుకాణాల్లో ఉన్న సరుకుల పైన దృష్టి సారించి నకిలీ విత్తనాల, ఎరువుల భారీ నుంచి కాపాడాలని రైతులు కోరుకుంటున్నారు.

Next Story