- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: ఎండలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం (weather) ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు ఎండలు మండుతుండగానే, మరోవైపు పలు జిల్లాల్లో వడగళ్ల వానలు (Hailstorm) బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వానలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుంభవృష్టి కురవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అకాల వర్షాల ధాటికి కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతింటుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ నిపుణుల హెచ్చరికల ప్రకారం.. అసలైన ముప్పు మార్చి 18 నుంచి 20 వరకు పొంచి ఉంది. ఈ మూడు రోజులు వాతావరణం అత్యంత ప్రచండంగా మారి, రాష్ట్రవ్యాప్తంగా 60 నుంచి 80 మి.మీ వరకు కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చునని, దీనివల్ల విద్యుత్ స్తంభాలు నేలకూలడం, భారీ హోర్డింగ్‌లు పడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ఈ అకాల వర్షాలు రైతన్నల నడ్డి విరిచేలా కనిపిస్తున్నాయి. వడగళ్ల వానలకు పంటలు నేలపాలయ్యే స్థితి నెలకొంది.
ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. పిడుగుల బారిన పడి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నందున, ఉరుములు, మెరుపుల సమయంలో ఎవరూ చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించింది. అకాల వర్షాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు రైతులు తమ పంట ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే 72 గంటలు అత్యంత కీలకం కావడంతో అధికార యంత్రాంగం కూడా హై అలర్ట్‌లో ఉంది.






