రాష్ట్రంలో అకాల వర్షం.. వడగళ్ల వాన బీభత్సం

by Malleboina Mahesh |

రాజస్థాన్‌ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పశ్చిమ తీర ప్రభావంతో మంగళవారం అల్వార్ జిల్లాలోని రాజ్‌గఢ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

రాష్ట్రంలో అకాల వర్షం.. వడగళ్ల వాన బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పశ్చిమ తీర ప్రభావంతో మంగళవారం అల్వార్ జిల్లాలోని రాజ్‌గఢ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీనికి తోడు పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన (Hailstorm) కురిసింది. తెల్లవారుజాము నుండే ఆకాశం మేఘావృతమై, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో జనజీవనం స్తంభించింది. రాజ్‌గఢ్ పరిసరాల్లో పెద్ద ఎత్తున వడగళ్లు పడటంతో రహదారులు, పొలాలు మంచు పొరలా తెల్లగా మారిపోయాయి. ఈ అకాల వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.

ఈ అకాల వర్షాలు, వడగళ్ల వల్ల ఆవాలు, గోధుమ వంటి రబీ పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) అల్వార్‌తో పాటు జైపూర్, భరత్‌పూర్, అజ్మీర్ వంటి 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో మరిన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దట్టమైన పొగమంచు, వర్షం కారణంగా రహదారులపై విజిబిలిటీ తగ్గి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Next Story