- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం మీరే కావచ్చు.. సీనియర్ మాత్రం నేనే : ఉదయనిధి
సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశంలో డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ద్రావిడ పార్టీల ఆధిపత్యం తర్వాత, విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (TVK) అధికారంలోకి వచ్చిన రోజే అసెంబ్లీ వేదికగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తమిళనాడు నూతన శాసనసభ స్పీకర్‌గా టీవీకే సీనియర్ నాయకుడు జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం ఆ పార్టీ తొలి విజయంగా కనిపిస్తోంది. సభను సమన్వయం చేయడంలో అనుభవం ఉన్న ప్రభాకర్ ఎంపికపై అందరూ హర్షం వ్యక్తం చేసినప్పటికీ, ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వేడిని పెంచాయి.
సభలో ప్రసంగించిన ఉదయనిధి స్టాలిన్.. ముఖ్యమంత్రి విజయ్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూనే రాజకీయ పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు. తామిద్దరం చెన్నైలోని లయోలా కాలేజీలో చదువుకున్నామని పేర్కొన్న ఆయన, విద్యార్థులుగా సమానమే అయినప్పటికీ, ప్రభుత్వ నిర్వహణలో మాత్రం తానే సీనియర్ అని వ్యాఖ్యానించారు. ఇది కేవలం స్నేహపూర్వక వ్యాఖ్యలా లేదా విజయ్ ను తక్కువ చేసి చూపే ప్రయత్నమా అనే దానిపై అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే డీఎంకే నేతలు మాత్రం గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయనిధి ఈ మాటలు అన్నారని చెబుతున్నారు.
మరోవైపు, అత్యంత వివాదాస్పదమైన 'సనాతన ధర్మం' అంశాన్ని ఉదయనిధి మరోసారి తెరపైకి తెచ్చారు. దేశ ప్రజలను విభజించే శక్తులను అడ్డుకోవాలని, సనాతన నిర్మూలన విషయంలో కొత్తగా ఏర్పాటైన విజయ్ ప్రభుత్వం తమ సలహాలు తీసుకోవచ్చని ఆయన సూచించారు. గతంలో కూడా సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ వేదికగా, కొత్త ప్రభుత్వం తమ మార్గదర్శకత్వంలో నడవాలని ఆయన కోరడం టీవీకే శ్రేణులకు మింగుడుపడటం లేదు. విజయ్ ఈ విమర్శలను, సూచనలను ఎలా స్వీకరిస్తారు, ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేతో ఆయన సంబంధాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.






