- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవలలను పెళ్లి చేసుకున్న కవలలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
కామారెడ్డిలో రెండు కవల జంటల పెళ్లిళ్లు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. ఈ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో జరిగిన ఆ అరుదైన వివాహం నేషనల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో రెండు కవల జంటల పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కవలల పెళ్లి ఎందుకు అంత వైరల్ అవుతోంది అనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక కవల జంటకు మరో కవల జంటతో వివాహం జరగడం ఈ ప్రధానాకర్షణకు కారణం. విజయ్, వినయ్ అనే ట్విన్స్ ఇద్దరూ.. కీర్తనా, కీర్తి అనే మరో ట్విన్స్ ను కామారెడ్డి పట్టణంలో ఆదివారం ఘనంగా వివాహం చేసుకున్నారు. సమీప గ్రామాలకు చెందిన ఈ రెండు కవల జంటల కలయిక చర్చనీయాంశంగా మారింది.
ఒకేలా కనిపించే ఈ రెండు జంటలు పెళ్లి వేదికపై పక్కపక్కనే కూర్చోవడంతో వేడుకకు హాజరైన అతిథులు ఆశ్చర్యానికి గురయ్యారు. వారు చిన్న తేడా కూడా లేకుండా ఒకేలా ఉండటంతో ఎవరు ఎవరో పోల్చుకోవడానికి చాలామంది కష్టపడ్డారు కూడా. వేదికపై ఒకేసారి రెండు కవల జంటల వివాహాలు జరగడం భలేగా ఉందని వివాహానికి హాజరైన వారు చెప్పుకున్నారు.
ఇక ఈ వేడుకను చూడటానికి కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కామారెడ్డి పట్టణ స్థానికులు ఈ పెళ్లిని "జిల్లా చరిత్రలో అరుదైన ఘట్టం"గా పేర్కొన్నారు. అతిథులు పెద్ద ఎత్తున ఫోటోలు, వీడియోలు తీసి ఈ ప్రత్యేక క్షణాలను గుర్తుగా దాచుకోవడమే కాదు, వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేయడంతో.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
అంతేకాదు పలు జాతీయ మీడియా ఛానెల్స్ లో కూడా ఈ ప్రత్యేక పెళ్లి గురించి ప్రసారం చేశాయి. కాగా తమ పెళ్ళికి భారీ ఎత్తున బంధువులు, అతిథులు హాజరై.. ఆశ్చర్యపోవడమే కాకుండా, తమ పెళ్లి ఫోటోలు, వీడియోలు జాతీయ మీడియాలో కూడా రావడంతో ఈ జంటలు పొంగి పోతున్నారు. కవలలకు పెళ్లి చేయడమే చాలా కష్టం అయిన ఈరోజుల్లో ఏకంగా కవల జంటకు మరో కవల జంట దొరకడం నిజంగా ప్రత్యేకమే.






