ఆ భయంకర జైలు పునఃప్రారంభానికి ట్రంప్ సిద్ధం

by Muthe.Rajitha |

అమెరికాకు చెందిన అత్యంత భయంకర అల్కట్రాజ్ జైలును పునఃప్రారంభించడానికి ట్రంప్ ప్రతిపాదన చేసారు.

ఆ భయంకర జైలు పునఃప్రారంభానికి ట్రంప్ సిద్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయానికి సిద్ధం అయ్యారు. అమెరికాకు చెందిన అత్యంత భయంకర అల్కట్రాజ్ (Alcatraz Federal Prison) జైలును పునఃప్రారంభించడానికి ట్రంప్ ప్రతిపాదన చేసారు. ట్రంప్ తన 2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో అల్కట్రాజ్ జైలు రీఓపెన్ కు ఏకంగా 152 మిలియన్ డాలర్లు అనగా సుమారు రూ. 1,280 కోట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరడంతో ఈ జైలుపై మరోసారి చర్చకు దారి తీసింది. 1963లో మూతపడి, ప్రస్తుతం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ దీవిని మళ్లీ అత్యంత భయంకరమైన నేరస్తులను, అక్రమ వలసదారులను ఉంచే భారీ భద్రత గల జైలుగా (State-of-the-art secure prison) మార్చాలన్నది ట్రంప్ ప్రధాన వ్యూహం. గత ఏడాది మే 2025 నుండే ఆయన ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

అయితే ఈ ప్రతిపాదనపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో తీరంలోని ఈ దీవి ప్రస్తుతం నేషనల్ పార్క్ సర్వీస్ ఆధీనంలో ఉండి. ఏటా సుమారు 1.4 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ట్రంప్ తన ప్రసంగాల్లో దీనిని "షార్కులు చుట్టుముట్టిన భయంకరమైన ప్రదేశం" అని వర్ణిస్తూ.. నేరస్తులకు ఇది సరైన శిక్షాస్థలం అని పేర్కొన్నప్పటికీ, డెమోక్రాట్లు మాత్రం దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా నాన్సీ పెలోసి వంటి అగ్రనేతలు ఈ ఆలోచనను అత్యంత మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. ఒక చారిత్రక పర్యాటక ప్రాంతాన్ని మళ్లీ జైలుగా మార్చడం ఆర్థికంగా భారీ నష్టమని, టూరిజం రంగానికి ఇది కోలుకోలేని దెబ్బ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇది కేవలం బడ్జెట్ ప్రతిపాదన మాత్రమే అయినప్పటికీ, ట్రంప్ ఈ ప్రాజెక్ట్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Next Story