బంగాళాఖాతంలో ద్రోణి.. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు

by Malleboina Mahesh |

"రాష్ట్రంలో ఎండలు ముదురుతున్న వేళ, ఈ నెల 7 తర్వాత అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బంగాళాఖాతంలో ద్రోణి.. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38°C ఉష్ణోగ్రత నమోదై ఎండల తీవ్రతను చాటిచెప్పింది. అయితే, ఇదే సమయంలో అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అసాధారణంగా పొగమంచు కురుస్తుండటం వాతావరణంలోని మార్పులకు సంకేతం గా కనిపిస్తోంది. తీవ్రమైన ఎండ కారణంగా ఇప్పటికే మామిడి పిందెలు రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ద్రోణి..

ఓవైపు ఎండలు మండిపోతున్న క్రమంలో వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న నాలుగు రోజుల్లో ద్రోణిగా బలపడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎండాకాలం ప్రారంభంలోనే ఇలాంటి అకస్మాత్తు మార్పులు రావడం మామిడి తోటలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పూత, పిందె దశలో ఉన్న తోటలకు ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బ తీసే ప్రమాదం ఉంది.

అకాల వర్షాల వల్ల మామిడి తోటల్లో తేమ శాతం పెరిగి తెగుళ్లు సోకే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షం పడే సూచనలు ఉన్నందున తోటల్లో మందుల పిచికారీని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే, వర్షపు నీరు తోటల్లో నిల్వ ఉండకుండా చూసుకోవాలని, గాలి వానల వల్ల కాయలు రాలకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని రైతులను అప్రమత్తం చేస్తున్నారు.

Next Story