అంగన్‌వాడీ పోస్టు భర్తీపై గిరిజనుల ఆందోళన

by Ratna Kumari |

భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తపల్లి తండా అంగన్‌వాడీ టీచర్ పోస్టు భర్తీ వివాదాస్పదంగా మారింది.

అంగన్‌వాడీ పోస్టు భర్తీపై గిరిజనుల ఆందోళన
X

దిశ, భీమదేవరపల్లి : భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తపల్లి తండా అంగన్‌వాడీ టీచర్ పోస్టు భర్తీ వివాదాస్పదంగా మారింది. దాదాపు ఎనిమిదేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టును స్థానిక అర్హులైన మహిళలకు కేటాయించకుండా, సమీపంలోని మంక్త్యా నాయక్ తండాకు చెందిన అంగన్‌వాడీ ఆయా బానోతు కమలను టీచర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం గిరిజనులు గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. గ్రామస్తుల కథనం ప్రకారం, పోస్టు ఖాళీగా ఉన్నప్పటి నుంచి తమ తండాకు చెందిన పలువురు నిరుద్యోగ మహిళలు ఉద్యోగం కోసం ఎదురుచూశారు. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం అర్హులైన స్థానిక మహిళలు దరఖాస్తులు కూడా సమర్పించారు. అయితే చివరికి స్థానిక అభ్యర్థులను పక్కనపెట్టి ఇతర తండాకు చెందిన వ్యక్తిని నియమించడం అన్యాయమని వారు ఆరోపించారు.

"ఎనిమిదేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టును ఇప్పుడు ఎందుకు భర్తీ చేశారు..? స్థానికుల దరఖాస్తులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు..? మా తండాకు చెందిన పోస్టును ఇతర తండాకు ఎలా కేటాయించారు..?" అంటూ గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని ఆరోపిస్తూ, పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తండాలో అర్హత కలిగిన నిరుద్యోగ మహిళలు ఉన్నప్పటికీ వారికి అవకాశం కల్పించకపోవడం స్థానిక యువతకు తీవ్ర నిరాశ కలిగించిందని గ్రామ పెద్దలు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిర్ణయం విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. పోస్టు భర్తీ ప్రక్రియను వెంటనే పునఃసమీక్షించి, స్థానిక అర్హురాలికే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించి, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై సీడీపీవో స్వరూపను వివరణ కోరగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయాలకు చేపట్టిన ప్రమోషన్ ప్రక్రియలో భాగంగానే బానోతు కమలను అంగన్‌వాడీ టీచర్‌గా నియమించినట్లు తెలిపారు. అయితే అధికారుల వివరణతో గ్రామస్తులు సంతృప్తి చెందలేదు. స్థానికులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ నియామకాన్ని రద్దు చేసి పునఃపరిశీలించాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story