యమునా నదిలో విషాదం.. 15కు చేరిన మృతుల సంఖ్య

by Malleboina Mahesh |

మధుర యమునా నదిలో పడవ ప్రమాదం: మృతుల సంఖ్య 15కు చేరిక. మోనికా, యశ్ మృతదేహాల లభ్యం. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు.

యమునా నదిలో విషాదం.. 15కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 10న ఉత్తర ప్రదేశ్‌లోని మధుర ప్రాంతంలో యమునా నది (Yamuna River)లో జరిగిన పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. గత శుక్రవారం సంభవించిన ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య (మృతుల సంఖ్య) తాజాగా 15కు చేరుకుంది. సోమవారం చేపట్టిన గాలింపు చర్యల్లో సహాయక బృందాలు నది నుంచి మరో రెండు మృతదేహాలను వెలికితీశాయి. వీటిని పంజాబ్‌కు చెందిన యశ్ భల్లా (యువరాజ్), మోనికాగా కుటుంబ సభ్యులు గుర్తించారు. నిన్నటి వరకు మరణాల సంఖ్య 13గా ఉండగా, తాజా మృతదేహాల లభ్యతతో ఆ సంఖ్య మరింత పెరిగింది.

ముమ్మరంగా గాలింపు చర్యలు

ప్రమాదంలో గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని సర్కిల్ ఆఫీసర్ సందీప్ సింగ్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), వాటర్ పోలీస్ మరియు స్థానిక గజ ఈతగాళ్లు ఈ ఆపరేషన్‌లో నిరంతరం శ్రమిస్తున్నారు. నదిని ఏడు సెక్టార్లుగా విభజించి, అత్యాధునిక డ్రోన్ల సహాయంతో గాలింపు చేపడుతున్నారు. పంజాబ్ నుంచి వృందావన్ దర్శనానికి వచ్చిన సుమారు 30 మంది యాత్రికులతో వెళ్తున్న ఈ పడవ, కేషీ ఘాట్ వద్ద పాంటూన్ వంతెనను ఢీకొని బోల్తా పడటమే ఈ ఘోరానికి కారణమైనట్లు అధికారులు గుర్తించారు.

Next Story