- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు TPCC విస్తృత స్థాయి సమావేశం.. హాజరుకానున్న సీఎం, AICC ఇంచార్జ్
రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్‌స్వీపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్‌స్వీపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రేపు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని గాంధీ భవన్‌లో నిర్వహించనున్నారు. టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఏఐసీసీ ఇంచార్జ్ జనరల్ సెక్రెటరీ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. అదేవిధంగా ఏఐసీసీ.. ఉపాధి హామీ పథకం పేరు మార్పు, గాంధీ పేరు తొలగింపు అంశంపైన నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఈ రెండు అంశాలపైనే చర్చ కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సర్పంచ్ స్థానాలు గణనీయ సంఖ్యలో గెలుచుకున్నా, ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ కూడా సర్పంచ్ ఎన్నికల్లో పని తీరును ఆశించిన దానికంటే ఎక్కువనే కనబర్చడంతో అధికార పక్షం అలర్ట్ అయింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి అవకాశాలు ప్రత్యర్ధి పార్టీలకు ఇవ్వకుండా ఎన్నికలకు స్వీప్ చేయాలన్న లక్ష్యంతో పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. దానిలో ప్రతి వార్డు, డివిజన్ నుంచి ఆరుగురు చొప్పున అభ్యర్థుల పేర్లతో జాబితా రూపొందించి వారిలో సమర్ధులైన కోసం సర్వే నిర్వహించనున్నట్లుగా పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం సర్వేలో మంచి ఫలితాలు పొందిన సరైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై ఈ విస్తృత స్థాయి సమావేశంలో మరింత లోతుగా చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏఐసీసీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలపైన మీటింగ్‌లో చర్చించనున్నారు.
మరోవైపు కృష్ణా, గోదావరి జలాలపైన విపక్షాల ఆరోపణలు, విమర్శలు తిప్పికొట్టేలా కార్యాచరణ తీసుకుంటారని, అసెంబ్లీలో, అంతకు ముందు పార్టీ నేతలకు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా ఇచ్చిన అంశాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేలా పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేసేలా ప్లాన్ చేయనున్నట్లుగా పార్టీ నేతలు తెలిపారు. జిల్లా కార్యవర్గాల కూర్పుపై డీసీసీ చీఫ్‌లకు టీపీసీసీ మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ కమిటీల జాబితాను నేటిలోగా ఇవ్వాలన్న ఆదేశాలతో జిల్లా కమిటీల కూర్పు ఓ కొలిక్కి వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 15న మండలాధ్యక్షుల నియామకాన్ని కూడా పార్టీ చేపట్టనున్నది.






