త్వరలో టీపీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటనలు

by Muthe.Rajitha |

ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజల్లోకి మరింతగా చేరువ చేసేందుకు టీపీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు.

త్వరలో టీపీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు అనేక నియామకాలను చేపట్టింది. డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంఘటన్ శ్రీజన్ అభియాన్ పేరుతో ఏఐసీసీ ఈ నియామకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రెండు జిల్లాలు మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల అధ్యక్షుల నియామకాన్నిక ఏఐసీసీ చేపట్టింది. ఈ జిల్లా అధ్యక్షులకు ఇటీవలే పది రోజుల పాటు వికారాబాద్ లో శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టింది. ముగింపు కార్యక్రమానికి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరై వారితో దాదాపుగా 4గంటల సేపు గడిపారు. దీనితో పాటు పెండింగ్ లో ఉన్న డీసీసీ కార్యవర్గాల్లో పదవులు భర్తీని ఇటీవలనే టీపీసీసీ చేటపట్టింది. 14 జిల్లాలకు కార్యవర్గాన్ని కూడా టీపీసీసీ ప్రకటించింది. గ్రామ పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో రానున్న రోజుల్లో జెడ్పీ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంది. దీని కోసం ఇప్పటి నుంచే టీపీసీసీ చీఫ్​సమాయత్తమవుతున్నారు. జిల్లాల పర్యటనలకు మహేష్ కుమార్ గౌడ్ శ్రీకారం చుట్టారు.

జిల్లాల్లో పర్యటనల్లో భాగంగా ఆదివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో డీసీసీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోస కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఫలితం తప్పక ఉంటుందని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ఇంటింటికి చేర వేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని, అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీనే శాశ్వతమని మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. ముఖ్యంగా జిల్లాల పర్యటనల ద్వారా టీపీసీసీ చీఫ్​పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమగ్రంగా చేరేలా పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్ధేశం చేయనున్నారు. ప్రతి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ, స్థానిక సమస్యలు, పార్టీ పరిస్థితులపై మహేష్ కుమార్ గౌడ్ సమీక్షలు చేయనున్నారు.

గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసి, భవిష్యత్ ఎన్నికల దిశగా పటిష్ట కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటనలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలకు ఆయన రూపొందించనున్నారు. ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడం ద్వారా పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాల పర్యటనల ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని, కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందన్న ఆశాభావాన్ని హస్తం శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.

Next Story