ఒడిశాలో టోర్నడో బీభత్సం

by Muthe.Rajitha |

ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలో సంభవించిన టోర్నడో బీభత్సంలో ఇద్దరు మరణించగా 29 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఒడిశాలో టోర్నడో బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశా రాష్ట్రం మయూరభంజ్ జిల్లాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. మార్చ్ 15 ఆదివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ప్రకృతి విలయతాండవం చేసింది. సాధారణంగా వేసవి కాలం ప్రారంభంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో వచ్చే 'కాల్‌బైశాఖీ' (Nor'wester) తుఫానులు ఈసారి అత్యంత శక్తివంతమైన టోర్నడోగా రూపాంతరం చెందాయి. వాతావరణ నిపుణుల ప్రాథమిక అంచనా ప్రకారం.. ఇది EF2 కేటగిరీకి చెందిన టోర్నడోగా పేర్కొన్నారు. ఒడిశాలోని మయూరభంజ్ లోని కరంజియా బ్లాక్ పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ విధ్వంసం చుట్టుపక్కల ప్రాంతాలకు తీరని నష్టం కలిగించింది. రాకాసి టోర్నడో ముందుకు సాగుతుంటే, దారిలో ఉన్న కియా, కంకడ, పనపోసి, డుమురియా, బార్, టాటో వంటి గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి. ముఖ్యంగా NH-220 జాతీయ రహదారి పరిసరాల్లో ఉన్న ఇళ్ల పైకప్పులు, భారీ టిన్ రేకులు గాలిలో కాగితాల్లా ఎగిరిపోయి కిలోమీటర్ల దూరంలో పడటం ఈ టోర్నడో తీవ్రతకు నిదర్శనం.

ఇద్దరి మృతి.. నిలువనీడ కోల్పోయిన వందలాది కుటుంబాలు

ఈ ఘోర ప్రకృతి ప్రకోపానికి ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆస్తి నష్టం విషయానికి వస్తే, దాదాపు 100కు పైగా ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. నిరుపేదల గడ్డి ఇళ్లు, తాత్కాలిక షెడ్లు గాలివేగానికి ఆనవాళ్లు లేకుండా పోయాయి. భారీ వృక్షాలు వేళ్లతో సహా పెకిలించుకుపోయి విద్యుత్ తీగలపై పడటంతో ఆ ప్రాంతమంతా చీకటిలో మునిగిపోయింది. వందలాది విద్యుత్ స్తంభాలు విరిగిపడటమే కాకుండా, రోడ్లపై చెట్లు అడ్డంగా పడిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని చోట్ల ఆటోలు, ద్విచక్ర వాహనాలు కూడా గాలివేగానికి ఎగిరిపడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభుత్వ సహాయక చర్యలు

ఈ విపత్తుపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం అగ్నిమాపక దళం, ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF) బృందాలు క్షేత్రస్థాయిలో యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి. రోడ్లపై పడిపోయిన భారీ వృక్షాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. భారతదేశంలో ముఖ్యంగా తూర్పు తీరంలో ఇలాంటి టోర్నడోలు రావడం చాలా అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతల వ్యత్యాసం, వాతావరణంలో సంభవించిన ఆకస్మిక మార్పులే ఈ సుడిగాలికి కారణమని విశ్లేషిస్తున్నారు. వీడియో

Next Story