- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ చరిత్రలో ఈ రోజు సువర్ణాధ్యాయం.. పండుగలా జరుపుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశం
రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందనుంది. ఇది చారిత్రాత్మక దినమన్న సీఎం చంద్రబాబు. సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు పిలుపు. జగన్ వైఖరిపై ధ్వజం.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లు బుధవారం లోక్ సభలో ఆమోదం పొందగా మరికొద్ది సేపట్లో రాజ్య సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవ్వనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందడం ఏపీ అభివృద్ధికి ఒక మలుపు అని అభివర్ణించారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన అతి తక్కువ కాలంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం పట్ల ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాజధాని అమరావతి పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ద్వేషం నిన్నటితో మరోసారి బయటపడిందని ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శించారు. "అమరావతి అనే పేరు పలకడానికే జగన్ ఇష్టపడటం లేదు. అందుకే 'మావి గన్' అనే వింత పేరును తెరపైకి తెచ్చారని, గతంలో ఎస్ఆర్ఎం అమరావతి పేరు నుంచి కూడా అమరావతిని తొలగించిన చరిత్ర ఆయనదని మండిపడ్డారు. అలాగే అమరావతి పేరు వింటేనే జగన్ విషం కక్కుతున్నాడని సీఎం మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా చేసిన వారు, ఇప్పుడు కూడా తమ వైఖరి మార్చుకోలేదని దుయ్యబట్టారు.
పండుగలా రాజధాని సంబరాలు
ఈ రోజు రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందనున్న సందర్భంగా ఈరోజు సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పండుగలా సంబరాలు జరుపుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో తాను మధ్యాహ్నం పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొంటానని తెలిపారు. "ఏకైక రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందని. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును కూడా త్వరలోనే సాకారం చేస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ.. ఇది చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సాధించిన గొప్ప విజయమని కొనియాడారు. సాయంత్రం జరిగే విజయ సంబరాల్లో జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటాయని వారు స్పష్టం చేశారు.






