- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దేముల్‌లో టిప్పర్ల 'యమ'వేగం.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జనం ప్రయాణం!
పెద్దేముల్‌లో టిప్పర్ల అతివేగం సామాన్య ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. టార్పాలిన్ లేకుండా సుద్ద, మట్టి తరలిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, పెద్దేముల్: పెద్దేముల్ మండల కేంద్రంలో టిప్పర్ల హంగామా మితిమీరిపోతున్నది. సుద్ద గనుల నుంచి సుద్ద ఫ్యాక్టరీలకు ముడి సరుకు (సుద్ద), ఇటుక బట్టీలకు చెరువు నల్లమట్టి, కోటపల్లి ప్రాజెక్టు కెనాల్ నిర్మాణం పనుల కోసం వినియోగిస్తున్న మొరం మట్టి తరలిస్తున్న టిప్పర్లు నిబంధనలు గాలికొదిలేసి రోడ్లపై యమ వేగంతో దూసుకుపోతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిరంతరాయంగా సాగుతున్న ఈ రవాణాతో అటు వాహనదారులు, ఇటు పాదచారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
గాలిలో సుద్ద.. కళ్లలో మట్టి!
ముడి సరుకును తరలించే క్రమంలో టిప్పర్లపై కనీసం టార్పాలిన్ కప్పడం లేదు. దీనివల్ల ప్రయాణికుల కళ్లలో సుద్ద పొడి, మట్టి పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాల వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారులు కళ్లు కనపడక కింద పడిపోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఓవర్ లోడ్‌తో పాటు అతి వేగం తోడవ్వడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు వణికిపోతున్నారు.
ఎవరిది ఈ నిర్లక్ష్యం..
సుద్ద గనుల నుంచి ఫ్యాక్టరీలకు సుద్ద, చెరువు నుంచి ఇటుక బట్టీలకు నల్ల మట్టి, కోటపల్లి ప్రాజెక్టు కెనాల్ పునర్నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్న మొరం మట్టి రవాణా చేస్తున్న వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నా సంబంధిత శాఖల అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే టిప్పర్ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇంతకీ ఈ నిర్లక్ష్యం ఎవరిదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, అతి వేగంగా వెళ్లే టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని, అధిక లోడుతో ప్రయాణిస్తున్న ప్రతి వాహనంపై తప్పనిసరిగా టార్పాలిన్ కట్టేలా నిబంధనలు అమలు చేయాలని ప్రయాణికులు, మండల ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే యంత్రాంగం మేల్కోవాలని హెచ్చరిస్తున్నారు.






