‘హస్తం'లో టికెట్ల యుద్ధం.. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు!

by Jakkula.Mamatha |

పురపాలక సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రధాన రాజకీయ పక్షాలకు తీవ్ర తలనొప్పి గా తయారవుతుంది

‘హస్తంలో టికెట్ల యుద్ధం.. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు!
X

మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో టికెట్ల కోసం ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో, ఎవరిని ఎంపిక చేయాలో తెలియక నియోజకవర్గ ఇన్చార్జీలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మల్, ఆదిలాబాద్, బెల్లంపల్లి వంటి చోట్ల సీనియర్ నేతల మధ్య ఉన్న గ్రూపు విభేదాలు పార్టీ ప్రతిష్ఠను పణంగా పెడుతున్నాయి. చైర్మన్ అభ్యర్థుల ఎంపికను టీపీసీసీ పర్యవేక్షిస్తుండగా, కౌన్సిలర్ స్థానాల బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. ప్రతి వార్డులోనూ ముగ్గురు నుండి నలుగురు అభ్యర్థులు గట్టిగా పోటీ పడుతుండటంతో, టికెట్ దక్కని వారు తిరుగుబాటు చేసే ప్రమాదం పొంచి ఉంది. ఈ అంతర్గత కలహాలు చక్కదిద్ది, గెలుపు గుర్రాలను ఖరారు చేయడం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక అగ్ని పరీక్షగా మారింది.

దిశ, నిర్మల్ ప్రతినిధి: పురపాలక సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రధాన రాజకీయ పక్షాలకు తీవ్ర తలనొప్పి గా తయారవుతుంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నియోజకవర్గ ఇన్చార్జీలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు బాధ్యతలు ఇవ్వగా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం టిపిసిసి చూస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. చైర్మన్ పదవి గెలవాలంటే కీలకమైన కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికనే అత్యంత జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అభ్యర్థుల ఎంపిక ఆచితూచి చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోల..

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంతో పాటు టీపీసీసీ ద్వారా ఖరారు చేయనున్న చైర్పర్సన్ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారి తీసేలా కనిపిస్తున్నది అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోల విపరీతంగా తయారైంది. ప్రతి నియోజకవర్గంలో రెండు నుంచి మూడు వర్గాలు తయారయ్యాయి. ఈ పరిణామాలు మున్సిపల్ ఎన్నికల పై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నడుమ విభేదాలు ఉన్నాయి. బైంసాలో నియోజకవర్గ ఇన్చార్జి నారాయణరావు పటేల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి నడుమ వివాదాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి.

ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రం గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ఉండగా... ఈ స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చూస్తున్నది. అయితే అభ్యర్థుల ఎంపిక తీవ్ర వివాదాలకు దారి తీసేలా ఉంది.ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కిసాన్ సెల్ నేత శ్రీకాంత్ రెడ్డి మాజీ పిసిసి నేత గండ్రత్ సుజాత నడుమ గొడవలు ఉన్నాయి. ఆసిఫాబాద్ లో నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్ నాయక్ మాజీ డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ నడుమ గ్రూపులు ఉన్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు ప్రభావం బలంగా ఉంది ఇక్కడ ఎక్కువగా ఆయనను వ్యతిరేకించేవారు లేరు. బెల్లంపల్లి లో సిట్టింగ్ ఎమ్మెల్యే వినోద్ మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు నడుమ తీవ్ర గొడవలు కొనసాగుతున్నాయి. చెన్నూరు లో మంత్రి వివేక్ వ్యతిరేకించి జడ్పి మాజీ చైర్మన్ మూల రాజిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి.

టికెట్ల ఖరారు కష్టమే...

తీవ్ర వివాదాల నేపథ్యంలో కౌన్సిలర్ టికెట్ల ఖరారు కష్టతరంగా మారిందని పార్టీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు ప్రతి వార్డులో కనీసం ముగ్గురు నుంచి నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీపడుతున్నారని దీన్ని చక్కదిద్దడం అంతా సులువు కాదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Next Story