మహానగరంలో దారుణం.. కలకలం గా మారిన ‘ట్రిపుల్ మర్డర్’

by Malleboina Mahesh |

బతుకుదెరువు కోసం వలస వచ్చిన కుటుంబాన్ని దుండగులు దారుణంగా హత్య చేసి గోనె సంచిలో పెట్టి వేరు వేరు ప్రాంతాల్లో విసిరేశారు.

మహానగరంలో దారుణం.. కలకలం గా మారిన ‘ట్రిపుల్ మర్డర్’
X

దిశ, వెబ్ డెస్క్: బతుకుదెరువు కోసం వలస వచ్చిన కుటుంబాన్ని దుండగులు దారుణంగా హత్య చేసి గోనె సంచిలో పెట్టి వేరు వేరు ప్రాంతాల్లో విసిరేశారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో చోటుచేసుకుంది. అత్యంత పాశవికమైన ‘ట్రిపుల్ మర్డర్’ బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం బీహార్ నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని వారి సన్నిహితులే దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో గౌరవ్ కుమార్ (24) అనే యువకుడి మృతదేహం సోమవారం ఉదయం అడయార్‌లోని ఒక బైక్ షోరూమ్ సమీపంలో గోనె సంచిలో కుక్కిన స్థితిలో లభ్యమైంది. తల, ముఖంపై తీవ్రమైన గాయాలతో ఉన్న గౌరవ్‌ను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా, అతని భార్య మినుకుమారి, రెండేళ్ల కుమారుడు బీర్మణి కుమార్ కూడా అదృశ్యమైనట్లు గుర్తించారు.

హత్యకు గురైన వారి కోసం గాలించిన పోలీసులకు బుధవారం మధ్య కైలాష్ సమీపంలోని కూవం నది (బకింగ్‌హామ్ కెనాల్) పొదల్లో రెండేళ్ల పసివాడి మృతదేహం లభించింది. నిందితులు చిన్నారిని కూడా కనికరం లేకుండా చంపి నదిలో పడేశారు. ఈ అమానుషానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న బీహార్‌కే చెందిన సికందర్ (33), నరేందర్ కుమార్ (45) సహా ఐదుగురు వలస కార్మికులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మద్యం మత్తులో జరిగిన గొడవ కారణంగానే ఇనుప రాడ్లతో దాడి చేసి ఈ ముగ్గురిని చంపినట్టు సమాచారం. ప్రస్తుతం గౌరవ్ భార్య మృతదేహం కోసం పెరుంగుడి డంప్‌యార్డ్, నది పరివాహక ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు.

Next Story