సంచలనం.. అమెరికా దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి

by Malleboina Mahesh |

ఓమన్ తీరంలో 'ఎంటి సెట్టెబెల్లో' నౌకపై అమెరికా జరిపిన క్షిపణి దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.

సంచలనం.. అమెరికా దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఓమన్ తీరానికి సమీపంలో గల్ఫ్ ఆఫ్ ఓమన్ (Gulf of Oman) లో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటి సెట్టెబెల్లో’ (MT Settebello) అనే వాణిజ్య చమురు ట్యాంకర్ నౌకపై అమెరికా సైనిక బలగాలు క్షిపణి దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు (Sailors) దుర్మరణం పాలయ్యారు. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, మరియు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్‌గా అధికారులు గుర్తించారు. అమెరికా విధించిన చమురు దిగుమతుల ఆంక్షలను ఉల్లంఘించి ఇరాన్ నుంచి ఈ నౌక ఇంధనాన్ని రవాణా చేస్తోందని, తమ ఆదేశాలను పాటించనందుకే నౌక ఇంజిన్ రూమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఖచ్చితమైన దాడి (Precision Strike) జరిపామని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) సమర్థించుకుంది. అయితే, దాడి సమయంలో ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా, వారిలో 21 మందిని ఒమన్ అధికారులు సురక్షితంగా రక్షించారు.

అమెరికా తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం

ఈ చారిత్రాత్మక రక్షణ, వాణిజ్య ఉల్లంఘనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అత్యంత తీవ్రంగా స్పందించింది. న్యూఢిల్లీలోని ఒక సీనియర్ అమెరికన్ దౌత్యవేత్తను పిలిపించి (Summon), అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై, భారతీయ పౌరులపై జరిగిన ఈ ప్రాణాంతక దాడిని తీవ్రంగా తప్పుబడుతూ అధికారిక నిరసనను (Formal Protest) నమోదు చేసింది. నిరపరాధులైన నావికుల ప్రాణాలను రక్షించడం అత్యంత ముఖ్యమని, ఇలాంటి దాడులను వెంటనే ఆపాలని భారత్ స్పష్టం చేసింది. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఘటనను ‘తీవ్ర దురదృష్టకరం’ అని అభివర్ణిస్తూ, మరణించిన నావికుల కుటుంబాలకు మోడీ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సురక్షితంగా బయటపడ్డ 21 మంది సిబ్బందిని స్వదేశానికి తీసుకురావడానికి, అలాగే మరణించిన ముగ్గురి భౌతికకాయాలను వారి చివరి కర్మల నిమిత్తం త్వరగా భారత్‌కు తరలించడానికి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

Next Story