మహిళా జర్నలిస్టులకు బెదిరింపులు తప్పడం లేదు : ప్రొ.పద్మజా షా

by Muthe.Rajitha |

మహిళా జర్నలిస్టులు చట్టపరమైన బెదిరింపులు, వృత్తిపరమైన ఒంటరితనం, నిరంతరం ఆన్‌లైన్ ట్రోలింగ్ రూపంలో వేధింపులను ఎదుర్కోక తప్పడం లేదని ప్రొ.పద్మజా షా ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా జర్నలిస్టులకు బెదిరింపులు తప్పడం లేదు : ప్రొ.పద్మజా షా
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశంలో నేడు మహిళా జర్నలిస్టులు చట్టపరమైన బెదిరింపులు, వృత్తిపరమైన ఒంటరితనం, నిరంతరం ఆన్‌లైన్ ట్రోలింగ్ రూపంలో వేధింపులను ఎదుర్కోక తప్పడం లేదని ప్రొ.పద్మజా షా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత పాత్రికేయులు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ. యస్. బషీరుద్దీన్ 90వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగ రిటైర్డ్ అధ్యాపకురాలు ప్రొ.పద్మజా షా హాజరయ్యారు. ఈ సందర్భంగా బషీరుద్దిన్ చిత్ర పటానికి నివాళి అర్పించి జర్నలిజంపై మహిళల ప్రభావం అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రొ.బషీరుద్దీన్ జర్నలిజం విభాగ భవిష్యత్తును ముందు చూపుతో అభివ్రుద్ధిబాటలో నడిపించారని, ఈ ప్రక్రియలో ఆయన మహిళలను అద్భుతమైన మార్గాల్లో నిపుణులుగా తీర్చిదిద్దారని ప్రొఫెసర్ పద్మజా కొనియాడారు. మహిళా జర్నలిస్టులకు, అడ్డంకులు నిత్యం ఎదురవుతున్నాయని, వారి వారి స్వేచ్చా, స్వతంత్ర అభిప్రాయాలకు అంతగా విలువ లేకుండా పాలకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రొ. బషీరుద్దీన్ చేసిన సేవలు మరువలేనివని, అంబేద్కర్ వర్శీటీకి మౌళిక వసతుల ఏర్పాటులో ఆయన పాత్ర మరవలేనిదని కొనియాడారు

ప్రస్తుత పరిస్థితుల్లో సమాజాన్ని జాగృతం చేయడంలో మీడియా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని ప్రొ. ఘంటా చక్రపాణి ఆందోళన వ్యక్తం చేశారు. పాత్రికేయులు, మీడియా సంస్థలు సామాన్యులకు అండగా నిలవడంలో, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడంలో అటు పాత్రికేయులు, ఇటు మీడియా సంస్థలు తమ తమ పాత్రను పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, జర్నలిజం విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సునీల్ కుమార్ పోతన వందన, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next Story