ఢిల్లీలో రెండు ప్రముఖ పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్

by Malleboina Mahesh |

"ఢిల్లీలోని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు! పాఠశాలల ఖాళీ.. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్. దర్యాప్తు చేస్తున్న పోలీసులు."

ఢిల్లీలో రెండు ప్రముఖ పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో మరో సారి బాంబు బెదిరింపులు (Bomb threats) కలకలం గా మారాయి. సోమవారం ఉదయం.. రెండు పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (Army Public School,), లోధి రోడ్డులోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్ (Air Force Bal Bharati School) ఈ బెదిరింపులను అందుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సంస్థలు అప్రమత్తమై భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.

బెదిరింపు ఈమెయిల్స్ అందిన వెంటనే పాఠశాల యాజమాన్యాలు అధికారులకు సమాచారం అందించాయి. ముందస్తు జాగ్రత్తగా రెండు పాఠశాలల ప్రాంగణాలను ఖాళీ చేయించి, విద్యార్థులను, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఢిల్లీ పోలీసులతో పాటు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పాఠశాలల చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ప్రస్తుతానికి తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈమెయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయి. పంపినవారు ఎవరు అనే కోణంలో సైబర్ సెల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

Next Story