- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యావరణ హితుడు ఈ జడ్జ్.. రోజూ సైకిల్ జర్నీ
కోయంబత్తూర్ జిల్లా 5వ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి పి.కె. శివకుమార్.. రోజూ ఆయన కోర్టుకు వెళ్లే విధానం, కోర్టు ప్రాంగణంలో ఆయన ప్రవర్తన ప్రస్తుతం అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : టాప్ గేర్ లగ్జరీ కార్లు, పటిష్టమైన పోలీసు భద్రత, వెనుక అటెండెంట్ల హడావుడి.. సాధారణంగా ఒక జిల్లా జడ్జి హోదాలో ఉన్న వ్యక్తి ప్రయాణం అంటే అందరికీ గుర్తొచ్చే దృశ్యాలివి. కానీ వీటన్నింటికీ భిన్నంగా, అత్యున్నత పదవిలో ఉంటూ కూడా ఎంతో సాదాసీదాగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కోయంబత్తూర్ జిల్లా 5వ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి పి.కె. శివకుమార్. రోజూ ఆయన కోర్టుకు వెళ్లే విధానం, కోర్టు ప్రాంగణంలో ఆయన ప్రవర్తన ప్రస్తుతం అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది.
ఆనాటి నుండి నేటి వరకూ
తమిళనాడులోని నామక్కల్ జిల్లాకు చెందిన పి.కె. శివకుమార్ గతంలో సేలం, కోయంబత్తూర్, మేట్టుపాళ్యయం, పుదుకోట్టై వంటి పలు ప్రాంతాలలో మేజిస్ట్రేట్, సబ్-ఆర్డినేట్ కోర్టులలో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో కూడా ఆయన ఎటువంటి ఆడంబరాలకు పోకుండా కేవలం సైకిల్‌పైనే కోర్టుకు వెళ్లేవారు. కొద్ది నెలల క్రితం ఆయనకు జిల్లా జడ్జిగా పదోన్నతి లభించింది. హోదా పెరిగినా ఆయన తన అలవాటును మాత్రం మార్చుకోలేదు. కోయంబత్తూర్ జిల్లా కోర్టుకు బదిలీ అయినప్పటికీ, ఇప్పటికీ రోజూ సైకిల్ తొక్కుకుంటూనే న్యాయస్థానానికి చేరుకుంటున్నారు.
అటెండెంట్లు వద్దు.. సిబ్బందితోనే భోజనం
జడ్జి శివకుమార్ కేవలం ప్రయాణంలోనే కాదు, తన రోజువారీ అలవాట్లలోనూ ఎంతో నిరాడంబరతను ప్రదర్శిస్తారు. ప్రతిరోజూ ఇంటి నుంచే స్వయంగా భోజన బాక్సును వెంట తెచ్చుకుంటారు. సాధారణంగా న్యాయమూర్తులు తమ వ్యక్తిగత గదులలో భోజనం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఆయన మాత్రం మధ్యాహ్న సమయం కాగానే తన గదిలో కాకుండా, కోర్టులో పనిచేసే క్లర్కులు, అటెండెంట్లు వంటి సాధారణ సిబ్బందితో కలిసి కూర్చుని ఎంతో ఆప్యాయంగా భోజనం తింటారు.
అంతేకాకుండా, కోర్టు ప్రాంగణంలో నడుస్తున్నప్పుడు తన వెనుక ప్రొటోకాల్ ప్రకారం అటెండెంట్లు ఎవరూ రాకూడదని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరి హడావుడి లేకుండా, పూర్తి ఒంటరిగానే సాధారణ పౌరుడిలా కోర్టు కారిడార్లలో నడుచుకుంటూ వెళ్తారు. ఒక ఉన్నతమైన న్యాయస్థానంలో అత్యున్నత స్థానంలో కూర్చున్నప్పటికీ, అహంకారం లేని ఆయన జీవిత శైలిని చూసి కోర్టు సిబ్బంది, తోటి న్యాయవాదులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో హోదా ముఖ్యం కాదు, మానవత్వం, సింప్లిసిటీ ముఖ్యం అని ఆయన నిరూపిస్తున్నారు.






