Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని తెలుగు ఎమ్మెల్యేలు వీరే..

by Disha Web Desk 19 |
MLAs From Telugu States Who Did not Vote In Presidential Election
X

దిశ, వెబ్‌డెస్క్: MLA's From Telugu States Who Did not Vote In Presidential Election| భారత 15వ రాష్ట్రపతి పదవి కోసం జరిగిన పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా 98. 31 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపగా రాష్ట్రంలోని ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్డీయే అభ్యర్థిగా ఉన్న ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు చర్చనీయాంశమైంది. తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తొలి ఓటు మంత్రి కేటీఆర్ వేశారు. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు ఉండగా.. 117 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఏపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలోనే ఓటు వేశారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. వారిలో ఒకరు మంత్రి గంగుల కమలాకర్ కాగా మరొకరు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. గంగుల కరోనా బారిన పడటంతో ఆయన ఓటు వేయలేకపోయారు. చెన్నమనేని రమేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. అందువల్ల ఆయన కూడా తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండు పార్టీలు కూడా ఎన్డీయే అభ్యర్థికే మద్దతు తెలిపాయి. ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 172 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ తొలి ఓటును సీఎం జగన్ వేశారు. వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే అధికారుల అనుమతితో తెలంగాణలో ఓటు వేయగా మిగతా 150 మంది ఎమ్మెల్యేలు ఏపీలో వినియోగించుకున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి విదేశాల్లో ఉండటం చేత పోలింగ్‌లో పాల్గొనలేదు.

Next Story