తిరుపతిలో పెట్రోల్ కొరత లేదు.. అదంతా వట్టి పుకారు మాత్రమే!

by Malleboina Mahesh |

తిరుపతిలో పెట్రోల్ కొరత లేదు! పుకార్ల వల్ల బంకుల వద్ద భారీ క్యూలు, ట్రాఫిక్ జామ్. భక్తులు ఆందోళన చెందవద్దని అధికారుల స్పష్టీకరణ.

తిరుపతిలో పెట్రోల్ కొరత లేదు.. అదంతా వట్టి పుకారు మాత్రమే!
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. నగరంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని వెల్లడించారు. అయితే, ఈ పుకార్లు కారణంగా స్థానికులు ఆందోళనకు గురై ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు క్యూ కట్టారు. తమ వాహనాలకు 'ఫుల్ ట్యాంక్' చేయించుకోవాలనే తొందరలో వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విపరీతమైన రద్దీని నియంత్రించేందుకు కొన్ని బంకులను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చిందని, అంతే తప్ప ఇంధనం లేక కాదని అధికారుల ప్రకటనతో స్పష్టమైంది.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ పుకార్లను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి ప్రయాణ ప్రణాళికలు యథావిధిగా కొనసాగించవచ్చని టీటీడీ యంత్రాంగం భరోసా ఇచ్చింది. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ వల్ల స్థానిక క్యాబ్స్, ఆటోలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తగిన సమయం చూసుకుని బయలుదేరాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయవద్దని అధికారులు కోరారు. మరో రోజు లేదా రెండు రోజుల్లో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని వారు తెలిపారు.

Next Story