- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, కార్వాన్ : రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం జాంబాగ్‌లోని చంద్రశేఖర్ ఆజాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, మొహమ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు రాజా సింగ్, నవీన్ యాదవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలాతో కలిసి గోషామహల్ నియోజకవర్గానికి చెందిన 184 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలతో పాటు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేద, నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ గృహాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, టెండర్ ప్రక్రియ అనంతరం దశలవారీగా పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. లబ్ధిదారులు ఉపాధికి దూరం కాకుండా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి గృహాలను నిర్మిస్తామని తెలిపారు. పైలట్ ప్రాతిపదికన కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందజేస్తామని వెల్లడించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో కొత్త ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నామని, లబ్ధిదారులు జీవనోపాధికి సమీపంలోనే గృహాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధూల్‌పేట్ ప్రాంతంలోని సంప్రదాయ విగ్రహ తయారీదారుల జీవనోపాధికి అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మొహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ సొంతింటి పట్టా, ఇంటి తాళాలు అందుకోవడం ప్రతి కుటుంబానికి ఒక కల అని పేర్కొంటూ, లబ్ధిదారులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పాతబస్తీ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ రెండు పడకగదుల ఇల్లు అందించి పేదల కలను సాకారం చేయడంలో ప్రభుత్వం సహకరించిందని, ఇందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణ, ప్రాజెక్టు డైరెక్టర్ (హౌసింగ్) అశోక్ చక్రవర్తి, నాంపల్లి తహసీల్దార్ నయీమ్ ఉద్దీన్, ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ జ్యోతి, గృహనిర్మాణ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






