డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయికి చేరువ

by Malleboina Mahesh |   (  Updated:2026-05-20 05:04:27  IST  )

ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల కారణంగా భారత రూపాయి విలువ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా 96.90 గరిష్ట కనిష్టానికి పడిపోయింది.

డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయికి చేరువ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ సమీకరణాల వల్ల భారత కరెన్సీ (Indian currency) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 20 పైసలు క్షీణించి.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 96.90 అత్యంత కనిష్ట స్థాయి (All-Time Low) కి పడిపోయింది. ఇరాన్ - అమెరికా మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం, అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడమే రూపాయి చారిత్రాత్మక పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

భారతదేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడటం వల్ల, చమురు ధరలు పెరిగినప్పుడల్లా దేశం నుంచి డాలర్ల చెల్లింపులు పెరిగి రూపాయి విలువ మరింత బలహీనపడుతోంది. రూపాయి విలువ ఈ స్థాయిలో పడిపోవడం వల్ల దేశంలోకి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్స్, ముడిసరుకులు మరింత ప్రియం కానున్నట్లు తెలుస్తోంది. ఇది దేశీయంగా ధరల పెరుగుదలకు (ద్రవ్యోల్బణం) దారితీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్లోకి ప్రవేశించి డాలర్లను విక్రయించే వెసులుబాటు ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story