- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్షిణ తెలంగాణ ‘పెద్దాయన’ చక్రం.. సచివాలయంలో చర్చ!
కాంగ్రెస్ పెద్దాయన సిఫారసులకు మంత్రులు హడల్! రాజకీయాలకు దూరంగా ఉన్నా ఫోన్లు, లేఖలతో తెలంగాణ మంత్రులపై సీనియర్ లీడర్ ‘సి-ఫోర్స్’!

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీలోని ఓ పెద్దాయన నుంచి వచ్చే లేఖలు, ఫోన్లకు మంత్రులు హడలిపోతున్నారు. ఆయన నుంచి లేఖ వచ్చిందంటే చాలు దాన్ని వెంటనే చదువుతున్నారు. ఇక ఫోన్ వస్తే మాత్రం మీటింగ్‌లో ఉన్నా రెస్పాండ్ అవుతున్నారు. ఆయన చెప్పిందంతా విని సాధ్యమైన పనులైతే వెంటనే ఆ పని చేయాలని తమ శాఖ అధికారులకు చెబుతున్నారు. లేదంటే మాత్రం నేరుగా ఆయనకే ఫోన్ చేసి ‘సార్ ఆ పని కష్టం’ అని వివరిస్తున్నారు. తను చెప్పిన పనిని కొందరు మంత్రులు పట్టించుకోకపోతే సదరు పెద్దాయన స్వయంగా సంబంధిత మంత్రులకు ఫోన్ చేసి ‘ఏం అయ్యిందయ్యా.. నేను రాసిన లెటర్ అందిందా? ఇంతకు పని అవుతుందా? లేదా?’ అంటూ వాకబు చేస్తుంటారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది.
పని అవుతుందని ధీమా..
రాజకీయంగా, పాలన పరంగా సుదీర్ఘ అనుభవం ఉన్న దక్షిణ తెలంగాణకు చెందిన ఓ పెద్దాయన 2023 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆయన ఇంటికి ఇప్పటికీ చాలామంది ప్రజలు, నాయకులు వెళ్లి తమ సాధకబాధకాలు చెప్తుంటారు. ఆయన మాట చెప్తే ప్రభుత్వంలో పక్కా పని అవుతుందని ధీమాతో తమ సమస్యలను ఆయనకు వివరిస్తుంటారు. సదరు పెద్దాయన తన ఇంటికి వచ్చిన వ్యక్తులు, నాయకుల సమస్యలను ఓపిగ్గా వినండి తోపాటు పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటారు. ఫలానా మంత్రికి చెప్తే పని అవుతుందని కోరగా, ఆ మంత్రికి తన లెటర్ ప్యాడ్‌పై సిఫారసు లెటర్ రాస్తుంటారు. అలాగే లీడర్లు తమకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించాలనో, లేదంటే ఫలానా వర్క్ ఇప్పించాలని అడిగితే వాళ్లకు సైతం ఆయన సిఫార్సు లేఖలు ఇస్తుంటారు.
లెటర్లే కాదు.. ఫోన్లు..
అన్ని పనుల కోసం ఆయన లేఖలు రాయరు. రూల్స్‌కు లోబడి చేయాల్సిన పనులు ఉన్నవాటికి మాత్రమే లేఖలు రాసి, రూల్స్ దాటి చేయాల్సిన పనులకు మాత్రం మంత్రులకు ఫోన్లు చేస్తుంటారని తెలిసింది. ‘మీ దగ్గరికి మాకు తెలిసిన వ్యక్తి వస్తాడు. కాస్త పని చేసి పెట్టు. మనకు బాగా కావాల్సిన వ్యక్తి అంటూ ఆ పెద్దాయన మంత్రులకు ఫోన్లు చేస్తుంటారని తెలిసింది. ‘మనకు బాగా దగ్గరి వాడు. పోస్టింగ్ కోసం వచ్చాడు. మీ దగ్గరికి పంపుతున్న కాస్త చేసి పెట్టు’ అని మంత్రులకు సూచిస్తుంటారనే టాక్ ఉంది. ‘మీ డిపార్ట్‌మెంట్‌లో ఏదో చిన్న వర్క్ ఉందట. ఆ వర్క్ మనోళ్లకు ఇప్పించు’ అంటూ ఫోన్ చేసి చెప్తుంటారని ప్రచారం ఉంది. అయితే సదరు పెద్దాయన సీనియర్ లీడర్ కావడంతో ఆయన పై ఉన్న గౌరవంతో ఆయన నుంచి వచ్చే ఫోన్లకు మంత్రులు రెస్పాన్స్ ఇస్తున్నట్లు తెలిసింది. ఆయన చెప్పిన పని కాకపోతే వారం రోజుల తర్వాత ఫోన్ చేసి, తను చెప్పిన పని ఏమైందని ఆరా తీస్తుంటారనే టాక్ ఉంది.
ఇంకా పెత్తనం చేస్తారా?..
పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న సదరు పెద్దాయన నుంచి వచ్చే సిఫారసులను కొందరు మంత్రులు సంతోషంగా ఫీలవుతున్నారు. అంతటి సీనియర్ లీడర్ పని కోసం తనకు ఫోన్ చేశారని గర్వంగా ఫీలవుతుండగా, మరికొందరు మంత్రులు మాత్రం ఆయన చెప్పిన ప్రతి పని చెయ్యాలంటే ఎలా కుదురుతుంది? అని తమ సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. సీనియర్‌గా ఉన్న లీడరు అదే పనిగా ఫోన్ చేసి, తను చెప్పిన పని ఏమైంది? అని అడుగుతుండటంతో మరికొందరు మంత్రులు తమపై పెత్తనం చెలాయిస్తున్నారని భావనలో ఉన్నారు. ‘ఉమ్మడి రాష్ట్రం నుంచి అధికారాన్ని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు పాలిటిక్స్ నుంచి రిటైర్డ్ అయినా కూడా పెత్తనం చేస్తారా’ అంటూ విమర్శలు చేస్తున్నారు.






