‘పది’ పరీక్షలకు సై.. రాష్ట్రస్థాయి ర్యాంకులే టార్గెట్!

by Malleboina Mahesh |

కామారెడ్డి విద్యార్థుల 'పది' సంగ్రామం మొదలైంది! గత రికార్డులను చెరిపేసి, రాష్ట్రస్థాయిలో సత్తా చాటడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ పక్కా ప్లాన్. 13,154 మంది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్!

‘పది’ పరీక్షలకు సై.. రాష్ట్రస్థాయి ర్యాంకులే టార్గెట్!
X

కామారెడ్డి జిల్లా పదో తరగతి విద్యార్థుల భవితవ్యం తేల్చే పబ్లిక్ పరీక్షలకు కౌంట్‌డౌన్ మొదలైంది. గత ఏడాది వచ్చిన 13వ స్థానాన్ని చెరిపేసి, ఈసారి రాష్ట్రంలోనే అగ్రస్థానమే లక్ష్యంగా విద్యాశాఖ పక్కా వ్యూహాన్ని రచించింది. ఈనెల 14 నుంచి జరగనున్న ఈ మహా సంగ్రామంలో జిల్లా వ్యాప్తంగా 13,154మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే ధ్యేయంగా ప్రతి పాఠశాలలో విద్యార్థులను మానసిక యోధులుగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేక తరగతులు పాటు ఉత్సాహం నింపేలా స్నాక్స్ అందిస్తూ, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా ‘డేగ కన్ను’ నిఘాతో అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రస్థాయి టాప్-5 ర్యాంకులపై గురిపెట్టిన కామారెడ్డి జిల్లా, ఈసారి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా విద్యార్థుల విద్యా జీవితంలో అతిపెద్ద మలుపునకు సమయం ఆసన్నమైంది!. జిల్లా విద్యాశాఖ ఈసారి పదో తరగతి ఫలితాల్లో రికార్డులు సృష్టించేందుకు రంగం సిద్ధం చేసింది. గతేడాది 13వ స్థానంతో సరిపెట్టుకున్న జిల్లాను, ఈసారి ఏకంగా రాష్ట్రస్థాయిలో టాప్-5 లేదా మొదటి స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా అధికారులు ఒక ‘మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల్లో 13,154మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు పర్యవేక్షణలో పరీక్షా కేంద్రాల వద్ద మునుపెన్నడూ లేని విధంగా పటిష్టమైన నిఘా ఏర్పాటు కాబోతోంది.

ప్రత్యేక తరగతులు...

విద్యార్థులను కేవలం పరీక్షలకు సిద్ధం చేయడమే కాకుండా, వారిని మానసిక యోధులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి అర్థమయ్యే రీతిలో సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రివిజన్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులు నీరసించకుండా పౌష్టికాహారం, స్నాక్స్ అందిస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు స్వయంగా విద్యార్థులకు జవాబులు రాసే మెళకువలను వివరిస్తూ వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు.

65 కేంద్రాల్లో డేగ కన్ను..

పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 65 కేంద్రాలను అత్యంత వ్యూహాత్మకంగా ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ అనే పదానికే తావు లేకుండా 65మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, కేజీబీవీ విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ పారదర్శకంగా పరీక్షలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం పన్నిన ఈ పక్కా వ్యూహం ఫలిస్తే, కామారెడ్డి జిల్లా విద్యా పటంలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story