స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న నష్టాల పరంపర

by Malleboina Mahesh |

ముడి చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల నేడు భారత మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 680 పాయింట్లకు పైగా పతనం కాగా, నిఫ్టీ 23,700 స్థాయి దిగువకు చేరుకుంది.

స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న నష్టాల పరంపర
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరడంతో భారత స్టాక్ మార్కెట్లు (Indian stock markets) నేడు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ సుమారు 680 పాయింట్లు పతనమై 75,327 వద్దకు చేరుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 180 పాయింట్లకు పైగా క్షీణించి 23,640 స్థాయికి పడిపోయింది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 95.51 వద్ద సరికొత్త కనిష్ట స్థాయిని తాకడం ఇన్వెస్టర్లను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

మార్కెట్ పతనానికి ప్రధానంగా దేశీయంగా అమలు చేస్తున్న పొదుపు చర్యల ప్రభావం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 105 డాలర్లకు చేరడమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం పిలుపునిచ్చిన చమురు ఆదా, పొదుపు చర్యల వల్ల జ్యువెలరీ, ట్రావెల్, ఆటోమొబైల్ రంగాల్లో వినియోగం తగ్గుతుందనే భయంతో ఆయా రంగాల షేర్లు భారీగా విక్రయాలకు గురవుతున్నాయి. దీనికి తోడు విదేశీ పెట్టుబడిదారులు (FPIs) భారత మార్కెట్ల నుంచి తమ నిధులను వేగంగా ఉపసంహరించుకోవడం మార్కెట్లపై అదనపు ఒత్తిడిని పెంచుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story