తెలంగాణలో ‘అలైడ్ హెల్త్’ అగమ్యగోచరం.. ఐదేళ్లయినా ఏర్పాటు కాని కౌన్సిల్

by Malleboina Mahesh |

తెలంగాణలో అలైడ్ హెల్త్ కౌన్సిల్ ఏర్పాటులో జాప్యం! 57 రకాల వైద్య వృత్తుల భవిష్యత్తు అగమ్యగోచరం. విదేశాల్లో వెరిఫికేషన్ ఇబ్బందులు.

తెలంగాణలో ‘అలైడ్ హెల్త్’ అగమ్యగోచరం.. ఐదేళ్లయినా ఏర్పాటు కాని కౌన్సిల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య సేవల్లో డాక్టర్లు, నర్సులతో సమానంగా సేవలందించే 57 రకాల అనుబంధ వైద్య వృత్తుల(అలైడ్ హెల్త్ ప్రొఫెషన్స్) భవిష్యత్తు తెలంగాణలో అగమ్యగోచరంగా మారింది. వీరిని ఒకే గొడుగు కిందకు తెస్తూ కేంద్ర ప్రభుత్వం 2021 మార్చిలో నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రం వెంటనే స్థానిక కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా అలైడ్ హెల్త్ కేర్ కౌన్సిల్స్ ఏర్పాటులో మెజారిటీ రాష్ట్రాలు ముందడుగు వేయగా.. తెలంగాణలో మాత్రం ఆ దిశగా అడుగులు పడటం లేదు. వైద్య రంగంలో కీలక భూమిక పోషిస్తున్న అనుబంధ వృత్తుల నిపుణుల పట్ల రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి ఐదేళ్లు గడుస్తున్నా.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా రాష్ట్రంలో కౌన్సిల్ ఏర్పాటు కాకపోవడంపై నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్..

దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ఇప్పటికే రాష్ట్ర స్థాయి కౌన్సిళ్లను ఏర్పాటు చేసుకున్నాయి. మన రాష్ట్రంలో మినహా దక్షిణాదిలోనూ అన్ని రాష్ట్రాల్లో కౌన్సిల్స్ ఏర్పాటయ్యాయి. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రక్రియలో వెనుకబడి ఉన్నాయి. దీనిపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు రాష్ట్రాలను ఆదేశించింది. చివరకు సుప్రీంకోర్టు సైతం రాష్ట్ర కౌన్సిళ్లను తక్షణమే ఏర్పాటు చేయాలని కఠిన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కదలిక రాకపోవడం గమనార్హం. గత ప్రభుత్వం కౌన్సిల్ ఏర్పాటులో విఫలమైందని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదని వైద్య అనుబంధ వృత్తుల జాయింట్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర నాయుడు విమర్శించారు.

జాతీయ కమిషన్ ఏర్పడి ఐదేళ్లు గడిచినా, రాష్ట్రంలో కౌన్సిల్ లేకపోవడంతో నిపుణులు తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల రవిందర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కౌన్సిల్ ఆవశ్యకతను వివరిస్తూ జాయింట్ ఫోరమ్ ప్రతినిధులు ఇప్పటికే అకడమిక్ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ శివరాం ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. కౌన్సిల్ ఏర్పాటుతో 57 రకాల వైద్య అనుబంధ వృత్తులకు చట్టబద్ధత లభిస్తుందని కేంద్ర వైద్య అనుబంధ వృత్తి నిపుణుల కమిషన్ అధ్యక్షుడు, నిమ్స్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ సిరందాస్ శ్రీనివాసులు తెలిపారు. నిపుణుల రిజిస్ట్రేషన్, సర్టిఫికేషన్ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా స్పందించి, లక్షలాది మంది అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే రాష్ట్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని జాయింట్ ఫోరమ్ డిమాండ్ చేస్తోంది.

అలైడ్ హెల్త్ నిపుణులు లేకుంటే వైద్యం పూర్తి కాదు

మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ, రేడియోలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ(సీటీ, ఎంఆర్ఐ, ఎక్స్ రే), ఆప్టోమెట్రీ(కంటి వైద్యం), ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, ఓటీ టెక్నాలజీ, అనస్థీషియా టెక్నాలజీ, పెర్ఫ్యూజన్ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్, క్లినికల్ న్యూట్రిషన్(డైటీషియన్లు) తదితర 57 రకాల అనుబంధ వైద్య వృత్తులు తమకు అలైడ్ హెల్త్ కౌన్సిల్ ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నాయి. వైద్య చికిత్సలో డాక్టర్లు వ్యాధిని నిర్ధారించాలన్నా, చికిత్స అందించాలన్నా ఈ అలైడ్ హెల్త్ నిపుణుల సేవలు అత్యంత కీలకం. రోగికి రక్త పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్ నుంచి, శస్త్రచికిత్స సమయంలో కీలకమైన ఓటీ టెక్నీషియన్ వరకు ప్రతి ఒక్కరూ ప్రాణరక్షణలో భాగస్వాములే. వీరు లేనిదే ఆధునిక వైద్యం పూర్తికాదు. అయితే, వీరికి కౌన్సిల్ లేకపోవడంతో వీరి సేవలకు సరైన గుర్తింపు, హోదా లభించడం లేదు.

కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిందే..

కౌన్సిల్ గుర్తింపు లేని కోర్సులు చదవడం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర కౌన్సిల్ లేకపోతే ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వెళ్లినప్పుడు వెరిఫికేషన్ ప్రక్రియ లో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారంగా కోర్సులు నడిపిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే ప్రమాదం ఉంది. సరైన శిక్షణ లేనివారు ఈ వృత్తిలోకి ప్రవేశిస్తే రోగుల ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం ఉంది. కౌన్సిల్ ఏర్పాటుతో అలైడ్ హెల్త్ వృత్తులకు అధికారిక గుర్తింపు లభిస్తుంది. చదివిన కోర్సులకు అనుగుణంగా లైసెన్సులు లభిస్తాయి, తద్వారా విదేశీ ఉద్యోగాలకు మార్గం సుగమం అవుతుంది.

విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, బోధన ప్రమాణాలను కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. అనర్హులు, నకిలీ సర్టిఫికెట్లతో ప్రాక్టీస్ చేసే వారికి అడ్డుకట్ట పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సమాన పనికి సమాన వేతనం పొందే అవకాశం ఉంటుంది. కౌన్సిల్ ఏర్పాటుతో వైద్య సేవల్లో నాణ్యత పెరగడంతో పాటు అనధికార ప్రాక్టీషనర్లకు అడ్డుకట్ట పడుతుందని, ఉపాధి అవకాశాల్లో పారదర్శకత పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొండ నాగరాజు పేర్కొన్నారు.

Next Story