దూలపల్లి భూముల్లో ‘ల్యాండ్’ మాఫియా మాయాజాలం!

by Jakkula.Mamatha |

దుండిగల్ గండిమైసమ్మ మండలం దూలపల్లి గ్రామంలోని కోట్ల రూపాయల విలువైన భూములు అక్రమార్కులకు కామధేనువుగా మారాయి.

దూలపల్లి భూముల్లో ‘ల్యాండ్’ మాఫియా మాయాజాలం!
X

దిశ, మేడ్చల్ బ్యూరో: దుండిగల్ గండిమైసమ్మ మండలం దూలపల్లి గ్రామంలోని కోట్ల రూపాయల విలువైన భూములు అక్రమార్కులకు కామధేనువుగా మారాయి. ఒకే సర్వే నంబర్‌లో ఇద్దరికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు (ఓఆర్‌సీ) ఇవ్వడం, దాని ద్వారా ఎకరం భూమి ఉంటే రెండెకరాలకు జీపీఏలు సృష్టించడం, ఏకంగా ప్రభుత్వ భూమినే నష్టపరిహారంగా పొంది ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడం వంటి సంచలన అక్రమాలు వెలుగుచూశాయి. దశాబ్దాలుగా సాగుతున్న ఈ భూదందా, నకిలీ పత్రాల మాయాజాలం పై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ ఆస్తులతో పాటు అసలైన యజమానుల హక్కులను కాపాడాలని కోరుతూ సోమవారం మేడ్చల్ కలెక్టరేట్‌లో జరిగిన ‘ప్రజావాణి’ వేదికగా కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు బాధితులు.

సర్వే నెంబర్ 154 లో మాయాజాలం..

సర్వే నెంబర్ 154, 153 భూములు అక్రమార్కులకు కామధేనువుగా మారాయి. దశాబ్దాలుగా సాగుతున్న ఈ భూ దందాలో నకిలీ పత్రాల సృష్టి, ఒకే భూమిని పలువురికి విక్రయించడం, పరిమితికి మించి జీపీఏలు రాయడం వంటి సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి. దూలపల్లి సర్వే నెంబర్ 154లో 1981 జనవరి 13న బుర్గు బావి నారాయణ అనే వ్యక్తికి కేవలం ఒక ఎకరా భూమికి మాత్రమే అప్పటి రెవెన్యూ అధికారులు ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ (ఓఆర్‌సీ) జారీ చేశారు. అయితే, ఇదే సర్వే నంబర్ పరిధిలో 1996 సెప్టెంబర్ 27న సి.హెచ్. అజయ్ కుమార్ అనే మరో వ్యక్తికి ఏకంగా 2 ఎకరాల 22 గుంటలకు రెండో ఓఆర్‌సీ (నెం. J/3710/1996) జారీ కావడం గమనార్హం. ఒకే భూమిపై ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు కాలాల్లో ఓఆర్‌సీలు ఎలా జారీ చేశారనేది ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎకరా ఉంటే.. రెండెకరాల జీపీఏ!

తొలి ఓఆర్‌సీ ప్రకారం బుర్గు బావి నారాయణకు కేవలం ఒక ఎకరా భూమిపైనే హక్కులు ఉన్నాయి. కానీ, ఆయన 1991లో పెనుమత్స సీతారామరాజు అనే వ్యక్తికి ఏకంగా రెండు ఎకరాల విస్తీర్ణాన్ని చూపిస్తూ మేడ్చల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జీపీఏ (నెం. 96/IV/1991) రాసిచ్చారు. ఈ అదనపు ఎకరా భూమి ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆ జీపీఏ ఆధారంగా సదరు వ్యక్తి రోడ్లతో కలిపి సుమారు 2 ఎకరాల 10 గుంటల విస్తీర్ణంలో 38 ప్లాట్లతో అనధికార లేఅవుట్ వేసి విక్రయాలు కూడా సాగించారు.

ప్రభుత్వ పరిహారంలోనూ హస్తలాఘవం..

దూలపల్లి - జీడిమెట్ల మధ్య స్టీల్ సిటీ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం 2018లో భూసేకరణ చేపట్టింది. ఈ క్రమంలో బుర్గుబావి సత్యనారాయణ అనే వ్యక్తి సర్వే నంబర్ 154లో తనకున్న 33 గుంటల భూమి రోడ్డులో పోయిందని నమ్మించి, దానికి బదులుగా పక్కనే ఉన్న సర్వే నంబర్ 153లోని (ప్రభుత్వ భూమి) 33 గుంటల విలువైన భూమిని ప్రత్యామ్నాయంగా పరిహారంగా పొందారు. ఆ తర్వాత ఆ భూమిని ఓ నిర్మాణ సంస్థకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ కేటాయింపుల వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలను పిర్యాదులో పేర్కొన్నారు.

ఒకే ప్లాట్.. పలువురికి రిజిస్ట్రేషన్

ఈ సర్వే నంబర్ పరిధిలోని ప్లాట్ నంబర్లు 21, 22, 23 లను 2000 సంవత్సరంలో శ్రవణ్ అగర్వాల్ అనే వ్యక్తికి విక్రయించగా, ఆయన నుంచి 2019లో చందన్ సింగ్ రాథోడ్ కొనుగోలు చేశారు. అయితే, అవే ప్లాట్లను 2006లో బుర్గుబావి సత్యనారాయణ పేరిట కూడా రిజిస్ట్రేషన్లు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇలా ఒకే ప్లాట్‌ను పలువురికి ఓవర్‌ల్యాపింగ్ చేస్తూ విక్రయించడంతో అసలైన యజమానులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాగే, ఎలాంటి రెవెన్యూ రికార్డులు, రక్షణ కౌలుదారీ సర్టిఫికేట్లు లేకపోయినా.. హాసిని బాలయ్య అనే వ్యక్తి పేరిట ఉన్న పాత జీపీఏ (నెం. 80/IV/1991) ఆధారంగా కూడా వరుసగా విక్రయాలు జరిగాయని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సమగ్ర విచారణ చేయండి..

దూలపల్లి గ్రామం సర్వే నంబర్ 153, 154లలో 1981 నుంచి జరిగిన అన్ని ఓఆర్‌సీలు, జీపీఏలు, మ్యుటేషన్లు, లేఅవుట్ అనుమతులపై సమగ్ర ఉన్నత స్థాయి విచారణ జరపీ, తప్పుడు ఆధారాలతో పొందిన ప్రభుత్వ భూములను, పరిహారం సొమ్మును వెంటనే రికవరీ చేయడంతో పాటుగా, నకిలీ పత్రాలు సృష్టించి అసలైన భూ యజమానులను వేధింపులకు గురిచేస్తున్న అక్రమార్కులతో పాటు, వారికి సహకరించిన అధికారుల పై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story