2026 అసెంబ్లీ ఎన్నికలు : జాతీయ పార్టీలకు సవాల్.. ప్రాంతీయ పార్టీల ఉనికి పోరాటం!

by Muthe.Rajitha |   (  Updated:2026-02-26 17:26:10  IST  )

దేశంలో ఈ ఏడాది పలు ప్రాంతాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది.

2026 అసెంబ్లీ ఎన్నికలు : జాతీయ పార్టీలకు సవాల్.. ప్రాంతీయ పార్టీల ఉనికి పోరాటం!
X

దిశ, వెబ్ డెస్క్ : భారత రాజకీయ ముఖచిత్రం 2026లో మరో కీలక మలుపు తిరగబోతోంది. దక్షిణాన తమిళనాడు, కేరళ నుండి తూర్పున పశ్చిమ బెంగాల్, అస్సాం వరకు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు 2029 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో కేవలం అధికారం మాత్రమే కాదు, ప్రాంతీయ అస్తిత్వం, జాతీయ పార్టీల విస్తరణ లక్ష్యాల మధ్య ఒక యుద్ధమే జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయగా, రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, పొత్తుల ముందస్తు వ్యూహాల్లో మునిగిపోయాయి.

తమిళనాడు: ద్రవిడ రాజకీయాల్లో మూడో శక్తి ఉదయం?

తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే (DMK) - అన్నాడీఎంకే (AIADMK) ద్వంద్వ ఆధిపత్యానికి ఈసారి గట్టి సవాల్ ఎదురుకానుంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ రాజకీయ రంగ ప్రవేశం రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనంగా మారింది. ప్రాథమిక విశ్లేషణల ప్రకారం.. విజయ్ సుమారు 15-20% ఓట్లను చీల్చే అవకాశం ఉందని, ఇది అధికార డీఎంకే కూటమి సీట్లను ప్రభావితం చేయవచ్చని తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటుపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ 40కి పైగా స్థానాలను డిమాండ్ చేస్తుండగా, డీఎంకే మాత్రం కొత్త మిత్రపక్షాలను కలుపుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌కు 25 సీట్ల లోపే ఇచ్చేలా కనిపిస్తోంది. మరోవైపు, అన్నాడీఎంకే తన పట్టు నిలుపుకోవడానికి ఉచిత పథకాల ప్రకటనలతో ప్రజల్లోకి వెళ్తోంది.

కేరళ: 'రివాల్వీంగ్ డోర్' సంప్రదాయం?

కేరళ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే 'రివాల్వీంగ్ డోర్' (Revolving Door) సంప్రదాయం అంటే ప్రతి ఐదేళ్లకోసారి అధికారం మారడం అనే పద్ధతి మళ్లీ రిపీటయ్యేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించినప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) భారీ విజయం సాధించడం, వారి గెలుపు అవకాశాలను పెంచుతోంది. ఇక ఇటీవల కేరళ పేరును "కేరళం"గా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం ఒక చర్చనీయాంశంగా మారింది. విపక్ష నేత వి.డి. సతీశన్ కేరళలో యూడీఎఫ్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ కూడా 'ట్వంటీ20' వంటి చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది.

పశ్చిమ బెంగాల్: మమతా బెనర్జీ VS బీజేపీ

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(TMC) వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టాలని చూస్తోంది. అయితే రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు, పరిపాలనాపరమైన ఆరోపణలను సాకుగా చూపిస్తూ బీజేపీ దూకుడుగా ప్రచారం చేస్తోంది. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సువేందు నేతృత్వంలో 'రివర్స్ కౌంట్‌డౌన్' ప్రారంభమైందని తృణమూల్ ను హెచ్చరిస్తున్నారు. ఇక్కడ సిఏఏ (CAA) అమలు, వలసదారుల అంశాలు ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారనున్నాయి. ఇంకోవైపు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి టీఎంసీ, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా నిలవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ త్రిముఖ పోటీలో ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.

అస్సాం: బీజేపీ హ్యాట్రిక్ ఆశలు.. కాంగ్రెస్ బలోపేతం

అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తనదైన శైలిలో పాలన సాగిస్తూ బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చారు. ఇక సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఇది సుమారు 45 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఇప్పుడు ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, జనాభా ప్రాతిపదికన బీజేపీ 103 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా.. విపక్షాలు మాత్రం బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాలని చూస్తున్నాయి.

పుదుచ్చేరి: రెండు కూటములు

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఓటర్ల జాబితా సవరణ పూర్తయింది. ఇక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమి మరియు కాంగ్రెస్-డీఎంకే కూటమి మధ్య ప్రధాన పోరు ఉండనుంది.

మొత్తానికి ఈ ఐదు ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలు కేవలం అక్కడి ప్రభుత్వాలనే నిర్ణయించవు. జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వంపై ప్రజల స్పందనను కూడా తెలియజేస్తాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో ప్రాంతీయ అస్తిత్వం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండగా.. ఉత్తర-తూర్పు రాష్ట్రాలైన బెంగాల్, అస్సాంలలో జాతీయ పార్టీలు తమ ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్నాయి. మరి ఎవరి వ్యూహం ఫలిస్తుందో.. ఏ పార్టీ జెండా ఎగరనుందో ఎన్నికల వరకు వేచి చూడాలి.

Next Story