- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలస్యంగా ప్రారంభం.. నివేదికలకే పరిమితం
ప్రజాపాలన ప్రగతి నివేదిక-99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలోని కాగిత రామచంద్రపురం గ్రామంలో శనివారం నిర్వహించిన గ్రామ సభ సాదాసీదాగా ముగిసింది.

దిశ, నడిగూడెం : ప్రజాపాలన ప్రగతి నివేదిక-99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలోని కాగిత రామచంద్రపురం గ్రామంలో శనివారం నిర్వహించిన గ్రామ సభ సాదాసీదాగా ముగిసింది. గ్రామసభ నిర్వహణ పై గ్రామస్తులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, సభకు అధ్యక్షత వహించాల్సిన సర్పంచ్ గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. గ్రామసభ నిర్వహణ పై గ్రామస్తులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో నిర్ణీత సమయానికి సభ ప్రారంభం కాలేదు. ప్రజల రాక కోసం అధికారులు గంటకుపైగా నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం గ్రామస్తులు సభకు హాజరుకావడంతో సమావేశాన్ని ప్రారంభించారు. గ్రామసభ పై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం పై కొందరు గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను ప్రశ్నించారు.
మరోవైపు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులకు కూడా ఉదయం 9 గంటల సమయంలో సమాచారం అందించినట్లు తెలిసింది. సభకు సర్పంచ్ హాజరు కాకపోవడంతో ఎంపీడీవో అనుమతితో ఉపసర్పంచ్ అధ్యక్షతన ఇన్‌చార్జి కార్యదర్శి మల్లారెడ్డి గ్రామసభను కొనసాగించారు. సభకు ప్రత్యేక అధికారిగా నియమితులైన మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఎలినివో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగు పై దృష్టి సారించాలని సూచించారు. యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు నానో యూరియాను ఉపయోగించాలని కోరారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ప్రతిరైతు సహజ సాగు పద్ధతులను అవలంబించాలని సూచించారు. భూమి సారాన్ని పెంపొందించి పంట దిగుబడులు పెంచేందుకు వ్యవసాయ శాఖ ద్వారా జీలుగు విత్తనాలను సబ్సిడీ పై అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు పంట అవశేషాలను తగలబెట్టకుండా భూమిలో కలియదున్నాలని సూచించారు. పంట అవశేషాల నిర్వహణ ద్వారా భూమి సారం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. మండల విద్యాధికారి మాట్లాడుతూ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఈ విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) కూడా ప్రభుత్వం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా గ్రామప్రజలు, తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. ఎస్సై అజయ్‌కుమార్ మాట్లాడుతూ యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా లేదా విక్రయాల పై పోలీసు శాఖకు సమాచారం అందించాలని కోరారు. గ్రామంలో నాటు సారా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని, అక్రమ మద్యం విక్రయాల పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నాటుసారా విక్రేతల పై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే మైనర్లతో పాటు వారి తల్లిదండ్రుల పై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, సన్మార్గంలో నడుస్తూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. అయితే గ్రామ సమస్యలు, అభివృద్ధి అవసరాల పై పెద్దగా చర్చ జరగకపోవడంతో గ్రామసభ అధికారుల సూచనలు, నివేదికలకే పరిమితమైందనే అభిప్రాయం వ్యక్తమైంది.






