విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదు

by Ratna Kumari |

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు.

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదు
X

దిశ, కొత్తకోట : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. జూలై 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోటలో పర్యటించి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి పాఠశాల ప్రాంగణం, హెలిప్యాడ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.

రూ.1.77 కోట్ల సీఎస్ఆర్ నిధులు, దాతల సహకారంతో కొత్తకోట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనం నిర్మించగా, రూ.33.50 లక్షల వ్యయంతో పీఎం శ్రీ పథకం కింద లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ఈ నిర్మాణాలను జూలై 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గతంలో ఈ పాఠశాలలో విద్యార్థినులు తగిన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ప్రస్తుతం ఆధునిక వసతులతో కూడిన భవనం అందుబాటులోకి రావడం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్" ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ పాఠశాలలు పూర్తై సుమారు 2,500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తదితర వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ ప్యానెల్ బోర్డులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొంటూ, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. జూలై 15న ముఖ్యమంత్రి ముందుగా మహబూబ్‌నగర్‌లోని అమరరాజా సంస్థ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం మధ్యాహ్నం కొత్తకోటకు చేరుకుని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి, ప్రభుత్వ విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమం పూర్తిగా విద్యార్థుల కోసమే నిర్వహిస్తున్నందున రాజకీయ ప్రసంగాలకు తావు లేకుండా విద్యా అంశాలకే ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరగడంతో గత ఏడాదితో పోలిస్తే విద్యార్థుల ప్రవేశాలు కూడా గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఏఎస్పీ వీరారెడ్డి, జెడ్పీ సీఈవో యాదయ్య, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story