కొత్త కాలేజీలు సరే.. రిక్రూట్‌మెంట్లేవి?

by Disha Web Desk 2 |
కొత్త కాలేజీలు సరే.. రిక్రూట్‌మెంట్లేవి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త కాలేజీలను తీసుకొస్తున్నా, కోర్సులు పూర్తి చేసినోళ్లకు కొలువు కల్పించేలా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. రిక్రూట్‌మెంట్లు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నర్సింగ్ వ్యవస్థలో ఇలాంటి పరిస్థితి మరింత ఎక్కువగా ఉన్నది. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం ప్రతీ జిల్లాకో నర్సింగ్ కాలేజీని అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నది. మరో రెండేళ్లల్లో అన్ని కళాశాలలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా ఏటా వేలాది మంది నర్సింగ్ విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకొని బయటకు రానున్నారు. అయితే వారికి ప్రభుత్వం ఎలాంటి ఎంపవర్మెంట్​ఇస్తుందనేది స్పష్టంగా చేప్పలేని పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం సర్కార్ దవాఖాన్లలో నిబంధనల ప్రకారం వేల సంఖ్యలో నర్సులు అవసరం . కానీ ప్రభుత్వం భర్తీ చేసేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో ఉన్న వారిపైనే ఒత్తిడి పెరుగుతున్నది. పైగా ఆయా ఆస్పత్రుల్లో కనీస వేతనాలు, సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. దీంతో డ్యూటీలు చేయాలంటేనే నర్సులు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్సులు పూర్తి చేసినోళ్లు సర్కార్​దవాఖాన్లలో పనిచేసేందుకు ఇంట్రస్ట్​చూపడం లేదని స్వయంగా వైద్యాధికారులే చెబుతున్నారు. దీంతో కొలువులపై భరోసా కల్పించే దిశగా చర్యలు చేపడితే మరింత మంది విద్యార్థినులు ముందుకు వచ్చే అవకాశం ఉన్నదని డాక్టర్లు చెబుతున్నారు.

ప్రభుత్వంలో పది వేల మందే..

రాష్ట్రంలో నర్సింగ్ కోర్సు పూర్తిచేసి కౌన్సిల్‌లో ఏకంగా 50 వేల మంది రిజిస్ట్రర్‌గా ఉన్నారు. అయితే వీరిలో కేవలం ఆరు వేల మంది మాత్రమే రెగ్యులర్ విధానంలో సర్కార్ దవాఖాన్లలో పనిచేస్తుండగా, సుమారు మరో 4 వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో వర్క్ చేస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్‌లలో దాదాపు మరో పదిహేను వేల మంది పనిచేస్తున్నట్లు అంచనా. అయితే మిగిలిన 50% మంది విదేశాల్లో పనిచేసేందుకు వెళ్లినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ఆప్ ది రికార్డులో చెబుతున్నారు. అంటే ఇక్కడ చదివి సేవలు మాత్రం విదేశాల్లో అందిస్తున్నారని అర్థం. నర్సింగ్ వ్యవస్థకు అవసరమైన సౌకర్యాలు కల్పించి వారి సేవలను వినియోగించడంలో సర్కార్ విఫలమవుతున్నది.

లక్షల్లో జీతాలు..

విదేశాల్లో లక్షల్లో జీతాలు ఉండటంతో నర్సులంతా అక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మన దగ్గర రూ.25 వేలు తీసుకొనే ఓ నర్సు, అక్కడికి వెళ్తే ఏకంగా లక్ష నుంచి లక్షన్నర జీతం పెరుగుతున్నది. పైగా ఆయా దేశాల్లో డాక్టర్లతో సమానంగా నర్సులకు కూడా విలువ ఉంటుంది. సౌదీ అరేబియా దేశాల్లో ఒక్కో నెలకు సగటున స్టాఫ్​నర్సులకు లక్ష నుంచి లక్షన్నర, యూకేలో లక్షన్నర నుంచి రెండు లక్షలు, అమెరికా లాంటి దేశాల్లో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు జీతాలు ఇస్తున్నారు. దీంతో మెజార్టీ నర్సులంతా విదేశాలు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోన్నది.

Next Story

Most Viewed