ప్రభుత్వ ఉద్యోగంలో గంజాయి పర్వం

by Ratna Kumari |

ఖానాపురం మండలంలో గంజాయి రవాణా చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు పట్టుబడ్డాడు.

ప్రభుత్వ ఉద్యోగంలో గంజాయి పర్వం
X

దిశ, ఖానాపురం : ఖానాపురం మండలంలో గంజాయి రవాణా చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు పట్టుబడ్డాడు. అశోక్‌నగర్ గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితుడి వద్ద నుంచి 2.038 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సుమారు 2.45 గంటలకు ఎస్సై ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేయగా, అతని వద్ద 2.038 కిలోల ఎండు గంజాయి లభించింది.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,01,900 ఉంటుందని తెలిపారు. ఈ కేసులో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం తిరుమలగండి గ్రామానికి చెందిన పుట్టలభూపతి తండా నివాసి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాలోత్ కళ్యాణ్ (23)ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, హెచ్‌ఎఫ్ డీలక్స్ ప్రో ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8(సి)తో పాటు 20(బి)(ii)(బి) కింద కేసు నమోదు చేసిన పోలీసులు, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని మహబూబాబాద్ సబ్‌జైలుకు తరలించారు.

Next Story