పాఠ్యపుస్తకాల్లో పర్సంటేజీల పర్వం..!

by Jakkula.Mamatha |

ఏటా పెరుగుతున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజులకు తోడు పుస్తకాలు, యూనిఫాం, రవాణా, ఇతర పేర్లతో వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలు తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతున్నాయి.

పాఠ్యపుస్తకాల్లో పర్సంటేజీల పర్వం..!
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: ఏటా పెరుగుతున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజులకు తోడు పుస్తకాలు, యూనిఫాం, రవాణా, ఇతర పేర్లతో వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలు తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. మధ్యతరగతి, పేద కుటుంబాలు పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. మరోవైపు మాకు లాభాలే ముఖ్యమంటూ కొన్ని ప్రైవేటు పాఠశాలలు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఏ తరగతికి ఎలాంటి మెటీరియల్ ముద్రించాలి, ఎంత విక్రయించాలి, ఎంత లాభం రావాలి అనే అంశాలపై బుక్ స్టాల్స్ తో ముందస్తు ఒప్పందాలు జరుపుకున్నట్లు సమాచారం.

ఈ ఒప్పందాల ప్రకారం విక్రయాల ద్వారా వచ్చే లాభాల్లో 50 శాతం పాఠశాల యాజమాన్యానికి, 50 శాతం బుక్ స్టాల్ యాజమాన్యానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడి అంతా బుక్ స్టాల్ యజమానిదే అయినా ఎలాంటి పెట్టుబడి లేని స్కూల్ యాజమాన్యమే సింహభాగం లాభాలు దక్కించుకోవడం గమనార్హం. మెటీరియల్ అమ్ముడుపోయిన, అమ్ముడు పోకపోయినా ఆయా పాఠశాలలకు కమిషన్ ముందుగానే చెల్లించాల్సిందేననే నిబంధనలు కూడా ఉన్నట్లు సమాచారం.

జీఎస్టీ, డిస్కౌంట్ పేరిట తల్లిదండ్రులకు కుచ్చుటోపి..

పబ్లిషర్స్ వద్ద నుంచి బిల్లులు లేకుండా తక్కువ ధరకే విద్యా సామగ్రిని కొనుగోలు చేస్తున్నప్పటికీ, తల్లిదండ్రులకు మాత్రం జీఎస్టీ పెరిగిందంటూ అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేల రూపాయలు చెల్లించిన తర్వాత బిల్లు అడిగితే అధికారిక జీఎస్టీ బిల్లు కాకుండా ఒక తెల్ల కాగితంపై చేతితో రాసి ఇస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌లో సుమారు రూ.1,500 విలువ చేసే పూర్తి మెటీరియల్‌ను తమకు నచ్చిన విధంగా ఎమ్మార్పీ ముద్రించి రూ.3,500 వరకు విక్రయిస్తున్నారని సమాచారం. 10 నుంచి 15 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాం అంటూ తల్లిదండ్రులను నమ్మిస్తూ అసలు ధరకు రెట్టింపు వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం పై విద్య, వాణిజ్య శాఖల అధికారుల సమగ్ర దర్యాప్తు చేసి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్ని పుస్తకాలు సీజ్ చేశారు?

జిల్లావ్యాప్తంగా ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, హయ్యర్​ ప్రైవేట్ పాఠశాలలు సుమారు 150 ఉండగా వాటిలో ఎన్ని ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న గానే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిల్వ ఉంచిన పాఠ్యపుస్తకాలను విద్యార్థి సంఘం నాయకులు ఈ మధ్యకాలంలో జిల్లా కేంద్రంతో పాటు మరికొన్ని చోట్ల గుర్తించి విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు మొత్తం ఎన్ని పుస్తకాలు సీజ్ చేశారు, ఏయే పాఠశాలలపై చర్యలు తీసుకున్నారు, ఎంత మందికి నోటీసులు జారీ చేశారనే వివరాలు ఇప్పటివరకు వెల్లడించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చర్యలు తీసుకుంటామని చెప్పడం మాత్రమే కాకుండా, సీజ్ చేసిన పుస్తకాల పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై పలుమార్లు జిల్లా విద్యాశాఖ అధికారిని చరవాణిలో వివరణ కోరే ప్రయత్నం చేయగా స్పందించలేదు.

Next Story