- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ రాజ్యంతోనే పేదల కలలు సాకారం: మంత్రి సీతక్క
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంతోనే పేదల సొంతింటి కలలు సాకారం అవుతున్నాయని మంత్రి సీతక్క వెల్లడించారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంతోనే పేదల సొంతింటి కలలు సాకారం అవుతున్నాయని మంత్రి సీతక్క వెల్లడించారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, మహిళా సమాఖ్య గ్రూపు సహకారంతో నిర్మించిన క్లాస్ రూమ్ ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మహిళా సంక్షేమ శాఖ చైర్‌పర్సన్ శోభారాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కావలసినంత కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆలేరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నియోజకవర్గ సమస్యల పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని ఆమె కొనియాడారు. ఐలయ్య ఎప్పుడూ తన నియోజకవర్గ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తుంటారని, పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ద్వారా ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని మంత్రి గుర్తుచేశారు.
సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించడం ద్వారా ఇందిరమ్మ ప్రభుత్వం వారి కలలను నిజం చేస్తోందని, లబ్ధిదారుని గృహప్రవేశ కార్యక్రమానికి హాజరవడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా విద్యా, వైద్య రంగాల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన యూనిఫారాలు, ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేశామని, ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలే అత్యుత్తమ ఫలితాలు సాధించాయని పేర్కొన్నారు. ములుగు లాంటి మారుమూల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని, తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లి అప్పులపాలు కాకుండా ప్రభుత్వ పాఠశాలలనే ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అత్యధిక సంఖ్యలో మహిళా భవనాలు ప్రారంభించుకున్న ఘనత ఆలేరు నియోజకవర్గానికే దక్కుతుందని మంత్రి ప్రశంసించారు. అంతకు ముందు ఆమె యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఈ కార్యక్రమంలో స్థానిక, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






