గ్రామాల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధికి పునాది

by Ratna Kumari |

టేకుమట్ల మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు సీసీ రోడ్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం ప్రారంభించారు.

గ్రామాల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధికి పునాది
X

దిశ, టేకుమట్ల : టేకుమట్ల మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు సీసీ రోడ్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం ప్రారంభించారు. గర్మిళ్లపల్లి, పంగిడిపల్లి, వెంకట్రావుపల్లి, దుబ్యాల, టేకుమట్ల గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధికి పునాది అని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పశుపోషణ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మహిళా సంఘాల బలోపేతం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం సహా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అనంతరం మండలానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అర్హులైన పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం రూ.1,00,116 ఆర్థిక సహాయం అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్, స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story