- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను స్త్రీగా మారిన రోజు! - 2
ఆధునిక ఇరానియన్ సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న కష్టాలను విస్తారమైన ఊహాశక్తితో వర్ణించిన ఒక బృహత్ప్రణాళిక ఈ సినిమా.

“The Day I became A Woman” (రెండో భాగం)
ఆధునిక ఇరానియన్ సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న కష్టాలను విస్తారమైన ఊహాశక్తితో వర్ణించిన ఒక బృహత్ప్రణాళిక ఈ సినిమా. ఆమె ఇరాన్ ప్రభుత్వ అధికారిక సెన్సార్‌షిప్ వ్యవస్థ నుంచి తప్పించుకోవడానికి, ఫీచర్‌లను నియంత్రించే విధంగా మూడు వేర్వేరు షార్ట్ ఫిల్మ్ లను రూపొందించినట్లు దర్శకురాలు మార్జీహ్ మెష్కిని చెప్పింది గానీ అవి దేనికవే షార్ట్ ఫిల్మ్ లు మాత్రం కాదు. కథాంశాల ద్వారా కనెక్ట్ చేయబడనప్పటికీ, వ్యక్తిగత చిత్రాలు గొప్ప స్థాయీ విలక్షణతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, రెండవ చిత్రం చివరిలో ఆహూ కథ ముగింపులో ఏమైందో పరిష్కరించలేదు, మూడవ చిత్రంలో ఇద్దరు తోటి రైడర్‌ల చర్చ ఆ ఉత్కంఠను పెంచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. సైకిల్ పందెంలో పాల్గొన్న ఇద్దరు యువతులు వచ్చి సముద్ర తీరంలో ఒక సోఫా మీద హూరాతో కూర్చుని సంభాషిస్తారు. ఈ వయసులో ఇన్ని వస్తువులను మీరొక్కరే ఏంచేసుకుంటారు? కొన్ని మాకు ఇవ్వవచ్చు కదా అని అడుగుతారు. ఆమె అలా ఏ వస్తువునీ మీకివ్వలేనంటుంది. వాళ్ళిద్దరూ ఆహూ గురించి చెప్తారు గానీ ఆమె చివరికి సైకిల్ దిగి తన తెగతో వెళ్ళిందా లేక పందెం కొనసాగించిందా అనే విషయంలో విభేదిస్తారు. మూడవ కథ చివర్లో హూరా సమస్తమైన స్త్రీ బంధాల నుండి విముక్తి పొందినట్లుగా, వేచి ఉన్న ఓడమీద ఎక్కిన తర్వాత అది తేలుతూ ఉంటుంది. సైకిల్ పందెంలోని ఇద్దరు యువతుల్నీ, హవా ముద్రతీరానికి వచ్చి తన స్నేహితులు నడుపుతున్న షిప్పులను చూస్తూ నిలబడినట్లు కనపడుతుంది. ఆ విధంగా ఈ సినిమాలో ఊహకందని విధంగా అత్యంత సంతృప్తికరంగా మొదటి చిత్రాన్ని ముగింపులో చూస్తాం!
మొదటి చిత్రంలో బాలికకి సముద్రాన్ని, అది సూచించే ప్రతిదానిని, అక్కడ స్నేహాలను ఆస్వాదించే అవకాశం నిరాకరించబడింది, మూడవ చిత్రంలో వృద్ధురాలు సంప్రదాయాన్ని పూర్తిగా తారుమారు చేసి ఆమె ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆమె గృహస్థ వస్తువులన్నీ సముద్రం మీదకు తీసుకువెళ్లడం అసాధారణమైనది, ఇది కొందరికి హాస్యభరితంగా కూడా ఉంటుంది. తనను మాత్రమే కాకుండా తన ఇంటిని కూడా సముద్రం మీద పెట్టడంలో, వితంతువు సంప్రదాయాన్ని పూర్తిగా తలక్రిందులు చేసి, అంతిమ ప్రతీకారం తీర్చుకుంది!
ఈ చిత్రానికి ఆయువు పట్టులాంటి సన్నివేశం
మధ్యకథ “ఆహూ” ఇరాన్ లోని క్రూరమైన పితృస్వామ్యానికి సంబంధించి ప్రతీకాత్మకంగా, సినిమాటిక్‌గా అద్భుతంగా చిత్రీకరించిన గాఢమైన, ఉత్కంఠభరితమైన వ్యక్తీకరణగా ప్రసిద్ది చెందింది. కెమెరాను స్థిరమైన ప్రదేశంలో ఉంచి చిత్రీకరించిన మొదటి కథలోమాదిరిగా కాకుండా, ఇక్కడ కెమెరాను నిరంతరం స్థిరమైన కదలికలో ఉంచి దృశ్యీక రించారు. సముద్రతీరం వెంబడి రహదారిలో నిర్జనమైన, విశాలమైన ప్రదేశంలో మహిళల సైకిల్ పందెం జరుగుతుంది కాబట్టి ఈ చిత్రీకరణ పద్ధతి చక్కగా అమిరింది. ఆహూ భర్త వెంబడిస్తుంటాడు. ఆమె ఇతర మహిళా సైక్లిస్టుల గుంపు మధ్య ఉండడం వల్ల, ఆమె వర్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూని అతనికి దూరంచేస్తుంది. ఇది ఆమెని అనుసరించే సరళమైన, వేగమైన, గంభీరమైన మళ్ళీ మళ్ళీ కనిపించే ప్రాసచిత్రాల లాగా, క్లోజప్‌లలో ముందునుండి, వెనుకనుండి, ట్రాకింగ్ షాట్ల వైపునుండి హృద్యంగా పునరావృతమవుతూ హాయి గొలిపే కవితలా నొక్కిచెప్పిన కల్పిత విధానం మర్జీహ్ మెష్కిని దర్శకత్వ ప్రతిభను విశదం చేస్తుంది.
కథ ప్రారంభమైనప్పటికే రేసు వేగంగా పురోగమిస్తోంది. ఆహూ చాలామంది ఇతర మహిళల మధ్య బలంగా పెడలింగ్ చేస్తూ కనిపిస్తుంది. ఆమెతో పాటు ఛాదర్‌లు ధరించిన సైక్లిస్ట్ లు అందరు వారి ఛాదర్‌లు గాలికి విపరీతంగా ఎగురుతుండగా రోడ్డుమీదా, వారి పోటీదారులమీదా దృష్టి సారిస్తూ ఏకబిగిన రేసింగ్ చేస్తున్నారు. ఇది చూడటానికి చాలా ఉత్తేజభరితంగా ఉంటుంది, కానీ ఆహూ భర్త అకస్మాత్తుగా గుర్రంపై వచ్చి, ఆహూ అని కర్కోటకంగా పిలుస్తూ, ఆమె ఇంటికి వచ్చి భార్యచేసే పనులకు హాజరుకాకపోతే విడాకులు ఇస్తానని దౌర్జన్యంగా అరిచినప్పుడు వాతావరణంలో ఒక మార్పు వస్తుంది. ఆహూ ప్రతిస్పందించదు. తన వేగాన్ని తగ్గించదు. అప్పుడు ఉస్మాన్ అనే ముల్లా అరుస్తూ, ఆమె అక్కడికక్కడే దిగకపోతే ఆమెను పాపిగా ప్రకటిస్తానంటాడు. ఆహూ పెడల్స్ ని ఇంకా బలంగా తొక్కుతూ తదేకదృష్టితో సైకిల్ వేగం పెంచుతుంది. ఆమె వంశానికి చెందిన ప్రతినిధులు, సోదరులు ఎంతగా అరిచి హెచ్చరించినా ఆహూ రేసింగ్ చేస్తూనే ఉంటుంది. ఆహూ తండ్రి మన తెగలో విడాకులు తీసుకునే సాంప్రదాయం లేదని, విడాకులు తీసుకోకూడదని గర్జించి చెప్తాడు. కానీ ఆమె ఏమాత్రం లెక్క చెయ్యదు. ఇది ఆమె ఆమోఘమైన పట్టుదలశక్తిని ప్రదర్శిస్తుంది. ఆపడం తప్ప ఆమెకు వేరే మార్గంలేని పరిస్థితులలోనూ మరొక సైక్లిస్ట్ ని ఎంచుకొని ఆమెతో పాటు జూమ్ చేస్తూ తన ఏకాగ్రతను నిలుపుకుంటూ కొనసాగిస్తూనే ఉంటుంది. కెమెరా కూడా తన వేగాన్ని పెంచుతుంది. ఆహూ సోదరులు, తెగ బృందాలు చుట్టూ ముట్టడంతో సినిమా ముగుస్తుంది.
ఆహూ తన బైక్‌పై నుండి దిగిన తర్వాత ఏమవుతుంది? మనం ఈ విషయాల గురించి ఎప్పటికీ తెలుసుకోలేం! సినిమాలోని ఈ అస్పష్టత కథనాన్ని బిగి సడలకుండా కుతూహలంతో ప్రేక్షకులను ఎక్కువగా వెంటాడేలా చేస్తుంది. ఈ మహిళలు ఎవరు? వారి లక్ష్యం ఏమిటి? స్పష్టమైన విషయమేమిటంటే, నలుపురంగు ధరించిన సైకిల్ స్వారీచేసే సమూహం వాస్తవానికి పురుషాధిపత్యంతో నిండిన సమాజంలో వారి భర్తలు, కుటుంబాలు, వంశాలను వదిలి పారిపోతున్న మహిళల దళం. ఇది మృత్యు ఘంటికల స్వరాలతో స్వేచ్ఛకోసం ఆక్రోశించే స్వారీ, గతితార్కిక పారవశ్యంతో పాటు, ఈ శతాబ్దంలో కూడా నేటి ఆధునిక ఇరానియన్ స్త్రీలు ఎదుర్కొనే సంప్రదాయం - ఆధునికతల మధ్య వైరుధ్యాలను విషాదమైన, సరళమైన, కలయికలను మిళితం చేస్తూ అద్భుతంగా దృశ్యీకరించింది మర్జీహ్ మెష్కిని. ఈ సీన్ లోని కొరియోగ్రఫీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఈ ఇరానియన్ సినిమా ప్రత్యేకతలు;
మార్జీహ్ మెష్కిని మూడు - భాగాల కథలతో సాహిత్యపరంగా, పటిష్టంగా కంపోజ్ చేసిన అద్భుతమైన ప్రతీకాత్మక చిత్రమాలిక ఇది. ఈ మూడు కథల్ని మూడూ షార్ట్ ఫిల్మ్ లు గా ప్లాన్ చేసింది. “నేను స్త్రీగా మారిన రోజు” చిత్ర శైలీ, నిర్మాణాలు ఈ దశాబ్దంలోని ఇతర ఇరానియన్ సినిమాల కంటే చాలా భిన్నంగా ఉండడం వల్ల కూడా చాలా మనోహరంగా రూపుదిద్దుకుంది. గుట్టుగా, ఘోషాలో, సజీవంగా, సహజంగా ఉందని మనం భావించే సమాజంలో ఇరానియన్ సినిమా ఎంత ఆరోగ్యంగా ఉందో చెప్పడానికి “ది డే ఐ బికేమ్ ఎ వుమన్” ఒక తిరుగులేని నిదర్శనం. విదేశీయుల అధివాస్తవిక చలనచిత్రాల లాగా మానసిక అయోమయానికి గురిచేయకుండా, మూడు కథలూ చాలా సూటిగా, సరళంగా ఉన్నాయి. ఈ చిత్రంలో దేనినైనా వివరించడానికి ఎప్పుడూ విరామం ఇవ్వడం గానీ, అవకాశం తీసుకోవడం గానీ ఉండదు. పాత్రలు ఏ సన్నివేశంలోనూ తమను తాము సమర్ధించుకోవడానికి గానీ రక్షించుకోవడానికి గానీ మాట్లాడరు.
“హవా”, మొదటి కథ సినిమా శీర్షికకి అక్షరాలా సంబంధించినది. హవా అనే ఎనిమిదేళ్ళు నిండిన ఒక చిన్నారి పాప తన తొమ్మిదవ పుట్టినరోజున స్థానిక ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ఆమె అధికారికంగా వయోజనురాలు అవుతుంది. ఆరోజునుండి ఆమె ఛాదర్ ధరించాలి, మగపిల్లలతో తన స్నేహాన్ని మానుకోవాలి. హవా తన ప్రియ స్నేహితుడిని అతని స్నేహాన్ని9వ ఏట నుండే కోల్పోతుంది. అంతేగాక అనేక ఇతర నియమాలు, పరిమితులకు లోబడి ఉండాలి. హవా తన వ్యక్తిత్వంలో న్యాయ, అన్యాయవాద పరంపరలను ప్రేక్షకుల మదిలో రేకెత్తిస్తుంది. కానీ హవా పసితనంలో ఉంది కాబట్టి అమ్మ, అమ్మమ్మల ఆదేశాలను విధిగా పాటిస్తుంది. ఆమె తల్లి, అమ్మమ్మ తనకు నచ్చిన ప్లేమేట్‌ని ఇకపై సందర్శించ లేవని చెప్పినప్పుడు, ఆమె మధ్యాహ్న సమయంలో అంటే 12 గంటలకు జన్మించిందని, అప్పుడు 11 గంటల సమయం కావడంతో, చివరిసారిగా ఆమె తన స్నేహితుల్ని కలవడానికి ఆమెకు స్వేచ్ఛ, అర్హత ఉన్నాయని వాళ్ళమ్మ అమ్మమ్మకి చెప్తుంది. ఒక నల్లజాతి అబ్బాయితో ఇష్టంగా ఆడుకోవడమే గాకుండా మరికొందరు నల్లజాతి పిల్లలతో స్నేహం చేయడానికి ఇష్టపడుతుంది హవా. సముద్రతీరంలో ఆయిల్ డ్రమ్ములు నడుపుతున్న ఒక బాలుడు చేప బొమ్మను హవాకి చూపుతాడు. ఆమె దాన్ని చూసి అది భలే ముద్దుగా బాగుందని చెప్పి ఇష్టపడుతుంది. బాలుడు చేప బొమ్మని హవా కిచ్చి దానికి బదులుగా హవా హిజాబ్ ని తీసుకుని తెరచాపగా ఉపయోగించుకుంటాడు.
ఎనిమిదేళ్ల బాలిక “స్త్రీగా మారడం” అంటే ఏమిటో అర్థం చేసుకుంటుందా? వాస్తవానికి చిన్నారికి అర్ధం కాదు, ఆమె తన బెస్ట్ ఫ్రెండ్‌తో ఆడటం నిషేధించబడినప్పుడు ఆమె అవగాహన ఆ క్షణానికి పరిమితమవుతుంది. కథను విశ్వవ్యాప్తం చేసింది కూడా ఈ విషయమే! సినిమాలో క్లిష్టమైన సందర్భంలో, ఆమె జీవితం ఎలా మారబోతుందో ఆమెకు అవగాహన లేకపోవడం కూడా చాలా ముఖ్యమైనది. ఈ నిజజీవిత నాటకం లోపల, స్త్రీల జీవితాలను కంట్రోల్ చేయడానికి సమాజం నిర్దేశించిన అనేక ఇతర అర్థాలు, చిహ్నాలు ఈ చిన్న ఫిల్మ్ లో పొరలు పొరలుగా దాగి ఉన్నాయి.
మూడవ కథ “హూరా” అనే ఒక వృద్ధ వితంతువైన మహిళది; కిష్ విమానాశ్రయం వద్ద విమానం నుండి ఒక వయసు మళ్ళిన మహిళ వంగిపోయి కుంటుతూ దిగడం కనపడుతుంది. అక్కడ, పోర్టర్‌గా పనిచేస్తున్న ఒక బాలుడు, వీల్‌చైర్ ని తోస్తూ, ఆమె పనులకోసం తీసుకెళ్తాడు: విచిత్రంగా ఆ బాలుడు ఆమెను ఒక షాపింగ్ మాల్ తర్వాత ఇంకొక షాపింగ్ మాల్ కి తీసుకువెళ్తుంటాడు. అక్కడ, ఆమె తన దగ్గరున్న డబ్బును పెద్దమొత్తంలో ఖర్చుపెడుతూ రిఫ్రిజిరేటర్ కొని, చల్లని నీరు తాగడం తనకెంతో ఇష్టమైనా గానీ జీవితం మొత్తంలో తాగలేకపోయానని చెప్తుంది. ఇస్త్రీ బోర్డు, బాత్‌టబ్, వాషింగ్ మెషీన్, స్టీరియో, వివిధ రకాల మేకప్ సామాన్లు, రకరకాల వంట సామాన్లు-ఇలా ఆమెకు తన జీవితకాలమంతా కావాలనుకున్న, ఆమెకు ఎప్పుడూ లేని అనేక రకాల గృహోపకరణాల నన్నిటినీ కొనుక్కుంటుంది. ఆమె కొన్న వస్తువులతో నిండిన పెట్టెలను మోస్తూ ఎక్కువమంది పిల్లలు కనిపిస్తారు. ఆమె తన వస్తువులు పేరుకుపోతున్నప్పుడు వాటిని సముద్రపు ఒడ్డున సర్దిపెట్టమని బాలపోర్టర్‌లను ఆజ్ఞాపిస్తుంది. వారు వరుసగా బండ్లమీద ఉన్న వస్తువులను బీచ్ ఒడ్డున పెడతారు. ఇది 2008 లో డైరెక్టర్ ఆగ్నెస్ వర్దా నిర్మించిన ఫ్రెంచ్ చిత్రం “The Beeches of Agnes” చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకి అది ఇక్కడ గుర్తుకి వస్తుంది. దీనిలో హూరా వాస్తవంగా బీచ్ ఒడ్డుకి వెళుతుంది, అక్కడ ప్రదర్శనలో ప్రధానమైన అంశంగా అత్యంత ముఖ్యమైనదిగా ఒక పెద్ద మంచం, వివాహ గౌనుతో కూడిన బెడ్‌రూమ్ ప్రేక్షకులకు కనిపిస్తాయి. హూరాను ఉల్లాసమైన వితంతువుగా చూపిస్తూ ఆమె తన జీవితకాలమంతా అనుభవించలేకపోయిన అభిరుచులను తీర్చుకోబోతున్నట్లు ఈ సన్నివేశం ఉంటుంది!
అధివాస్తవిక ఫెడెరికో ఫెల్లిని చిత్రాల పద్ధతిలో రంగు రంగుల, విపరీతమైన, అనుచితమైన వస్తువులు, సంఘటనలు సాధారణ జీవితపు యాంత్రికతపై దాడిచేయడమే ఫెల్లినిస్క్ సన్నివేశం అని సినీ విమర్శకులు అంటారు. ఫెడెరికో ఫెల్లిని (Federico Fellini) ఒక ఇటాలియన్ చలనచిత్ర దర్శకుడే గాక స్క్రీన్ రైటర్ కూడా. అతను తన విలక్షణమైన శైలికి ప్రసిద్ధి చెందాడు, ఆయన ఫాంటసీ, రోమ్ లోని శిల్పకళా చిత్రాలను సామాన్యమైన రోజువారీ వస్తువులతో మిళితం చేసి చిత్రిస్తాడు. ఈ సన్నివేశం ఫెల్లినిస్క్ చిత్రంతో ముగుస్తుంది. బాల పోర్టర్ లు రేకు డబ్బాలతో తయారుచేసిన షిప్ మీద హూరా మంచంతో సహా వస్తువులన్నీ ఎక్కిస్తారు. ఆ పిల్లలు ఆయిల్ డ్రమ్ములతో తయారుచేసిన షిప్పులను నడుపుతుండగా ఆమె ఒక విహారయాత్రకు సిద్దమై బయలుదేరుతున్నట్లు సంతోషంగా హూరా మంచంమీద కూర్చుని ఉండగా షిప్ సాగిపోతూ కనిపిస్తుంది.
మళ్ళీ ఇక్కడ కథ అస్పష్టంగా ఉంటుంది: ఈ పురాతన మహిళ ఎవరు? ఈ వస్తువులన్నీ వయసు మీదపడుతున్న సంధ్యా సమయంలో ఆమె ఏమి చేసుకుంటుంది? బీచ్ మధ్యలో ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఎలా పని చేయగలవు? కానీ సామాజిక వ్యంగ్యానికి సంబంధించిన సూచనలు కథ గురించి మ్యాజిక్ రియలిజం ద్వారా ప్రకాశిస్తాయి. ఈ చిత్ర రచయితలు మర్జీహ్ మెష్కిని, మఖ్మల్‌బాఫ్‌లు సమకాలీన వినియోగదారుని అంతర్జాతీయ వాణిజ్యాన్ని దీర్ఘకాలిక కేంద్రంగా చేసుకుని ఎగతాళి చేస్తున్నారు, దీనికి కిష్ ద్వీపాన్నిఅనువైన మంచి ప్రదేశంగా ఎంచుకున్నారు. సాంప్రదాయ, మధ్యప్రాచ్య విలువలు - పాశ్చాత్య, ఆధునిక శైలులు వాణిజ్యవాదంతో ఢీకొన్నప్పుడు తలెత్తే గందరగోళాలను చూసి హేళనగా నవ్వుతున్నారు. ఈ సంస్కృతీ ఘర్షణ చివరికి ఎలా పరిష్కరించబడుతుంది? ఎవరికీ తెలియదు.
హూరా ఒక వస్తువుని మార్చుకోవడానికి మళ్ళీ బాలుడితో మాల్ కి వెళ్తుంది. ఆమె లేని సమయంలో అక్కడి వీధి బాలలందరూ తమ బట్టలను వాషింగ్ మిషన్ లో వేసి ఉతుక్కుంటారు. సముద్రతీరంలో ఏ ఆలంబనా లేకుండా వాటిని ఆరేస్తారు. అప్పుడు, బేసి దృశ్యాలు, దృశ్య శకలాలు, అకారణంగా దొరికిన, దొంగ చిత్రాలు ఉన్నాయి: ఒక చిన్న పిల్లవాడు ఇసుకలో ఉన్న అద్దంలో మేకప్ వేసుకున్నాడు. ఇంకొక పిల్లవాడు హూరా పెళ్లి గౌన్ ధరించడానికి ప్రయత్నిస్తాడు. మరొక చిన్న పిల్లవాడు వివాహ దుస్తులను ధరించి బీచ్‌లో నృత్యం చేస్తుంటాడు. ఒక బాలుడు రిఫ్రిజిరేటర్ లో పళ్ళు తీసుకుని తినేస్తాడు. బాత్ టబ్ లో స్నానం చేస్తాడొకడు. టి వి ఆన్ చేసేదొకడైతే, మొత్తంగా చాలామంది పిల్లలు మంచమెక్కి అల్లరి చేస్తారు! పవర్ పాయింట్స్ లేకుండా సముద్రతీరంలో ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయనేది ప్రేక్షకులకు అంతుబట్టదు. కానీ అధివాస్తవికకవిత్వం లాగా, ఆమోదయోగ్యమైన విధంగా కథను అల్లుకున్నారు రచయితలిద్దరూ! ఉత్కంఠభరితంగా ప్రతీకాత్మకమైన ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు మూడు కథలను తెలివిగా, ఇరాన్ పితృస్వామ్య సమాజపు క్రూరత్వాన్ని చేదుగా ఏకం చేస్తుంది.
ఈ చిత్రం పర్షియన్ గల్ఫ్ లోని కిష్ ద్వీపంలో, మూడు ఎపిసోడ్‌లు చాలావరకు సముద్రంలో వాటి ఫోటోజెనిక్, ఉపమాన అంశాలను ఉపయోగిస్తూ చిత్రీకరించారు.
“ది డే ఐ బికేమ్ ఎ ఉమెన్” చిత్ర పూర్తి చాతుర్యం హూరా కథ విప్పుతున్న కొద్దీ స్పష్టమవుతుంది. ఆమె పేరు మూడు కథల ఐక్యతకు ఒక ఆధారాన్ని కలిగి ఉంది: హవా + ఆహూ = హూరా. ఇతర కరస్పాండెన్స్ లు కూడా చిత్రంలోకి ప్రవేశిస్తాయి. ఒక “మంత్రగత్తె” తన చిన్నతనంలో ఒక నల్లజాతి వ్యక్తి నుండి తనను దూరంగా ఉంచిందని, ఆమె అలా ఉంచకపోతే తన జీవితం మరోలా ఉండేదని హూరా గుర్తుచేసుకుంటుంది; వెంటనే ఇది మొదటి ఎపిసోడ్‌లో నల్లజాతి అబ్బాయిలతో హవా స్నేహాలను ప్రేక్షకులకు స్ఫురిస్తుంది. సైకిల్ రేసులో పాల్గొన్న ఇద్దరు యువతులు బీచ్‌కి వచ్చి, ఆహూ తన ఇష్టానికి విరుద్ధంగా రైడింగ్‌ను ఎలా ఆపవలసి వచ్చిందో క్లుప్తంగా చెబుతారు; అయితే ఆహూకి చివరికి ఏమి జరిగిందో వారికి గాని, ప్రేక్షకులకు గాని తెలియదు. ఎందుకంటే ఆమె వేరొకరి బైక్‌పై మళ్లీ రేసులో పాల్గొందా లేక ఆమె సోదరులు బలవంతంగా ఇంటికి తిరిగి తీసుకెళ్ళారా అనే దానిపై మహిళలు విభేదించారు, ఆ తర్వాత ఆహూని ప్రేక్షకులు మళ్లీ చూడలేదు. చివరికి, హవా కనపడడంతో మూడు కథలు కలుస్తాయి. డ్రామా, కామెడీ, వర్తమానాలతో కూడిన వాస్తవిక చిత్రం.
ఈ చిత్రం ప్రత్యేకత దాని అధివాస్తవిక స్వభావం. ఫాంటసీ చాలా వాస్తవమైనది. దృశ్యీకరించిన సంఘటనలు భౌతికంగా భావించబడినప్పటికీ, ప్రతి చిత్రంలో ఒక కల లాంటి అనుభూతి ఉంటుంది. నిర్ణయాత్మకమైన అధివాస్తవిక అంశాలు సినిమాకి చెందిన ఉద్వేగభరితమైన కేంద్ర సందేశంనుండి పక్కకి తొలగవు. ఇరాన్ లో మహిళల జీవితాలను నియంత్రించే ఏకపక్ష సామాజిక ఆదేశాలు సహజంగా అసంబద్ధమైనవి. వాణిజ్య కేంద్రమైన కిష్ రిసార్ట్ లో సెటప్ చేసి అసంబద్ధతల మూలాలను దర్శకురాలు బయటకు తీసుకువచ్చిన విధానం చాలా అద్భుతమైనదని ప్రపంచ సినీ విమర్శకులు ప్రశంసించారు!
శివలక్ష్మి
చిత్ర సమీక్షకురాలు, రచయిత
94418 83949






