మానవ మృగం.. మహిళల మృతదేహాలనూ వదలని కామాంధుడు

by Muthe.Rajitha |

కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళల మృతదేహాల పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించిన ఒక కీచక మార్చురీ అటెండర్ నిర్వాకం వెలుగుచూసింది.

మానవ మృగం.. మహిళల మృతదేహాలనూ వదలని కామాంధుడు
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళల మృతదేహాల పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించిన ఒక కీచక మార్చురీ అటెండర్ నిర్వాకం వెలుగుచూసింది. బీదర్ వైద్య విజ్ఞాన సంస్థ (BIMS) ఆసుపత్రి మార్చురీలో శవాలపై లైంగిక పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ, వికృత ఆనందం పొందుతున్న అటెండర్ మునీర్ అహ్మద్‌ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. మునీర్ అహ్మద్ చాలా కాలంగా బిమ్స్ ఆసుపత్రి మార్చురీలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వివిధ ప్రమాదాలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద స్థితిలో మరణించి పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి వచ్చే మహిళల మృతదేహాలపై ఇతడు కన్నేసేవాడు. రాత్రి వేళల్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని, మార్చురీ గదిలోకి వెళ్లి మృతదేహాలపై ఉన్న వస్త్రాలను తొలగించి అత్యంత వికృతంగా ప్రవర్తించేవాడు. అంతటితో ఆగకుండా ఆ వికృత చేష్టలను, నగ్న మృతదేహాలను తన మొబైల్ ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సైకో ఆనందం పొందేవాడు.

గత కొంతకాలంగా మునీర్ అహ్మద్ ప్రవర్తన మరియు మార్చురీ గదిలో అతడి అనుమానాస్పద కదలికలపై ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ మోసునిల్ హక్‌కు అనుమానం వచ్చింది. దీనిపై నిఘా పెట్టిన డాక్టర్ హక్, మునీర్ చేస్తున్న ఘోరాన్ని పసిగట్టారు. వెంటనే ఈ విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, స్థానిక పోలీసు స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డాక్టర్ హక్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మునీర్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

ఈ క్రమంలో నిందితుడి మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసి పరిశీలించిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు భయటపడ్డాయి. ఆ ఫోన్ నిండా మహిళల మృతదేహాలకు సంబంధించిన వందలాది నగ్న ఫోటోలు, అసభ్యకర వీడియోలు లభ్యమయ్యాయి. కొన్నేళ్లుగా ఇతడు ఈ తరహా మానసిక వికృతితో ఈ ఘోరాలకు పాల్పడుతున్నట్లు డిజిటల్ ఆధారాలు లభించాయి. కాగా మరణించిన తర్వాత కూడా మహిళల శరీరాలకు కనీస గౌరవం ఇవ్వకుండా ఇన్నేళ్లుగా సాగుతున్న ఈ పైశాచిక ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

Next Story