నేను స్త్రీగా మారిన రోజు! - 3

by Muthe.Rajitha |

ఈ మూడు 24 నిమిషాల కథల్ని మూడు షార్ట్ ఫిల్మ్‌ లు గా ప్లాన్ చేసింది మార్జిహ్ మెష్కిని. ప్రతి ఫిల్మ్ కీ దాని కథానాయకురాలి పేరే పెట్టడం విశేషం.

నేను స్త్రీగా మారిన రోజు! - 3
X

“The Day I became A Woman” (మూడో భాగం)

ఈ మూడు 24 నిమిషాల కథల్ని మూడు షార్ట్ ఫిల్మ్‌ లు గా ప్లాన్ చేసింది మార్జిహ్ మెష్కిని. ప్రతి ఫిల్మ్ కీ దాని కథానాయకురాలి పేరే పెట్టడం విశేషం. ఇది మూడు వరుస కథలను చెప్పే పోర్ట్‌ మాంటియో (portmanteau) చిత్రం. అంటే శబ్దాలను, అర్థాలను ఒకే పదంగా మిళితం చేయడం - ఉదాహరణకు ‘మోటార్’ + ‘హోటల్’ కలిపి మోటెల్, అలాగే ‘బ్రేకఫాస్ట్’ + ‘లంచ్’ కలిపి బ్రంచ్ అన్నట్లుగా ఇక్కడ కథల నేపథ్యం, ఇతివృత్తాలలో చాలా పరిపూరకమైనవి. వాటికి కొన్ని తేడాలు ఉన్నప్పటికీ అవి ఒకే సినిమా అనుభవంలో చక్కగా ఒక అందమైన ఆకృతిలో కలిసిపోయాయి! మార్జిహ్ మెష్కిని సముద్రతీరంతో పాటు మూడు విభిన్న ప్రాంతాలను బాగా ఉపయోగించుకుంది, అయితే ఇరవై ఒకటవ శతాబ్దం ప్రారంభంలో ఇరానియన్ స్త్రీలను ఎదుర్కొనే సంప్రదాయం - ఆధునికత మధ్య వైరుధ్యాలమీదే ఎక్కువగా తన దృష్టి నిలిపింది గానీ ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతల మీద కాదు.

ఈ చిత్రంలో వాడిన గాంభీర్యం, మినిమలిజం, వాక్చాతుర్యం ఇరాన్ లోని స్త్రీ పాత్రలను బాధాకరమైన స్పష్టతతో వర్ణిస్తాయి. ఆహూ ఒక్క మాట కూడా మాట్లాడదు. నో, ఓకే అంతే. “మంచి సినిమాలో మాటలు తక్కువ, దృశ్యం ఎక్కువగా ఉండి దృశ్యమే మాట్లాడాల” ని సినీ విజ్ఞులు చెప్పిన సూత్రం ఈ సన్నివేశానికీ, సినిమా మొత్తానికీ నూటికి నూరుపాళ్ళూ వర్తిస్తుంది! ఆహూ మాత్రం సైకిల్ పెడల్ ని తొక్కిపెడుతూ తన ప్రతిఘటనని బలంగా ప్రదర్శస్తుంది. ఆమె ఏకాగ్ర చిత్తంతో తన స్వేచ్చ కోసం పోరాడుతూనే ఉంటుంది. అదే ఈ సినిమా బలం!

ఆహూ పాత్ర పోషించిన షబ్నమ్ టోలౌయ్ నటన అద్భుతం. నటి షబ్నమ్ టోలౌయ్ (Shabnam Toloui) ఒక ఇరానియన్ నటి, థియేటర్ డైరెక్టర్, నాటక రచయిత కూడా. టెహ్రాన్‌లో జన్మించింది. ఇరాన్ లోనే ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చదువుకుంది. ఇరాన్‌లో, ఇస్లామిక్ మతాధికారులు బహాయి మత విశ్వాసానికి చెందిన సభ్యులను అనేక హింసలకు గురిచేసి, కొన్నిసార్లు చాలా క్రూరంగా, భయంకరంగా ఉరితీసిన సంఘటనలు జరిగాయి. షబ్నమ్ టోలౌయ్ కూడా బహాయి మత విశ్వాసానికి చెందిన సభ్యురాలు కావడంతో అది తెలుసుకున్న ఇరాన్ ప్రభుత్వం ఆమెను సినిమా, టెలివిజన్‌లో పని చేయకుండా నిషేధించింది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీ శ్రీ అన్నట్లు మత భూతం ఎంతటి ప్రతిభావంతులనైనా ముప్పతిప్పలు పెడుతుంది. ఇదంతా భరించలేక, తన అభిరుచిని, ఆశయాలను కాపాడుకోవడానికి 2004 డిసెంబర్ లో ఫ్రాన్స్ దేశానికి వలస వెళ్ళిపోయింది. షబ్నమ్ టోలౌయ్ సైకిల్ పందెంలో అంత కసిగా నటించడం వెనక ఇరాన్ సమాజంలోని మహిళల మీద కొనసాగే మత హింసకు దన్నుగా తన వ్యక్తిగత హింస కూడా కారణం కావచ్చు! ఆమె ఏకాగ్ర చిత్తంతో తన స్వేచ్చకోసం పోరాడుతూనే ఉంటుంది!

చిత్రనిర్మాతలు తరచుగా కలలను చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు, కానీ తరచుగా అవి విఫలమవుతుంటాయి. ఇక్కడ, మనం వాస్తవాన్నే చూస్తున్నట్లుంటుంది. హూరా తనకు సహాయం చేస్తున్న నల్లజాతి పిల్లవాడిని ‘నేను పెంచుకుంటాను, నాతో వస్తావా’ అని అడుగుతుంది. ఆ బాలుడు నాకు అమ్మా, నాన్నా ఉన్నారని, నేను మీతో రాలేనని చెప్తాడు. ఆమె ఒకప్పుడు నల్లజాతి వ్యక్తిని ప్రేమించానని, అతన్ని వివాహం చేసుకోవడానికి సమాజం అనుమతించలేదని వ్యాఖ్యానించి, అతనితో వివాహం అయితే ఆ బాలుడి వయసున్న బాబు తనకు ఉండేవాడని అతన్ని తన కలల బిడ్డగా భావిస్తుంది. ఇది కొంచెం ఫన్నీగా అనిపించినప్పటికీ అది మన సామూహిక సబ్ కాన్షియస్ స్థితిలోని అండర్‌కరెంట్‌లోకి ప్రవేశిస్తుంది. కొత్తగా కొన్న వస్తువులను ఇంటికి లేదా అపార్ట్‌ మెంట్ కాంప్లెక్స్‌ కు తీసుకురావడానికి బదులుగా, వాటిని బీచ్‌కు తీసుకెళ్లి, తెల్లటి ఇసుకపై అన్ని వస్తువులను ఏర్పాటు చేస్తారు పిల్లలు. హూరా తన వస్తువులన్నీ ఏకంగా గోడలు లేని ఇంట్లో (సముద్రతీరంలో) పెడుతుంది. ఇలా సాంప్రదాయాలనన్నిటినీ తిరస్కరించడమనే విషయం చాలా సరికొత్త భావన, ఇంతకు ముందెన్నడూ చూడనిది, విచిత్రమైనది, ప్రత్యేకమైనది.

సమకాలీన వినియోగదారుని అంతర్జాతీయ వాణిజ్యానికి దీర్ఘకాల కేంద్రంగా ఉన్న కిష్ ద్వీపంలో సాంప్రదాయ మధ్యప్రాచ్య విలువలు, ఆధునిక పాశ్చాత్య శైలులు వాణిజ్యవాదంతో ఢీకొన్నప్పుడు తలెత్తే గందరగోళాలను చూసి చిత్ర రచయితలు మెష్కినీ, మఖ్మల్‌బాఫ్‌లు ఎగతాళి చేస్తూ నవ్వుతున్నారు. ఈ సంస్కృతి ఘర్షణ చివరికి ఎలా పరిష్కరించబడుతుంది? ఎవరికీ తెలియదు. నేటి ఇరానియన్ సినిమా ఉన్నత ప్రమాణాల ప్రకారం కూడా ఇది అత్యుత్తమ చిత్రం. ప్రేక్షకుల స్వంత నిర్ధారణలకు, అభిప్రాయాలకు అనుగుణంగా డైరెక్టర్ మార్జిహ్ మెష్కిని మూడు కథల్ని ఓపెన్ ఎండెడ్ గా వదిలేసింది. హవా గా నటించిన ఫతేమెహ్ చెరగ్ అఖర్ (Fatemeh Cherag Akhar) , ఆహూ గా నటించిన షబ్నం తోలౌయ్ (Shabnam Toloui), హురా గా నటించిన అజీజే సెడిఘి(Azizeh sedighi) తమ ఆస్తిత్వాలను పూర్తిగా మర్చిపోయి అద్భుతంగా తమ పాత్రలకు జీవం పోశారు!

`ఈ చిత్రం అందిస్తున్న సందేశం

ఈ చిత్రం చాలా దృఢమైన పితృస్వామ్య రాజకీయ సందేశాన్ని కలిగి ఉంది. ఇది అద్భుతమైన అనితరసాధ్యమైన మానసికశక్తి కలిగిన మహిళల చిత్రాలను మన ముందుంచుతాయి. వీటిని చూసిన ప్రేక్షకులకు ఈ మూడు పాత్రలలోని మహిళలు చాలా సామాన్యంగా, సార్వత్రికంగా, శక్తివంతంగా ఉండి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తూ ప్రేక్షకుల స్మృతిపథంలో చిరకాలం వెంటాడుతూనే ఉంటారు! చిన్నారులు హసన్ - హవాల మధ్య విషాదకరమైన వీడ్కోలు ప్రేక్షకులకు బాధాకరంగా ఉంటుంది. కర్రనీడ కనుమరుగైనప్పుడు, హవా పెద్దలపట్ల విధేయతతో ఇంటికి తిరిగి వెళ్తుంది. వయసు మళ్ళిన అమ్మమ్మ మాత్రమే, విజయగర్వంతో ఆమె ఒక స్త్రీ కాబోతుందని, సమాజ నిబంధనల ప్రకారం ప్రవర్తించాలని, ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శిస్తూ బురఖా కార్యక్రమానికి నాయకత్వం వహిస్తుంది. స్నేహితుణ్ణి కలవవద్దని చెప్పినప్పుడు నిరసన తెలిపిన బాలిక, ఆధునిక నాగరికత అలవర్చుకున్న తర్వాత భావిజీవితంలో ఆమె వాదనా నైపుణ్యాలు మెరుగుపడతాయని ప్రేక్షకులకు భరోసా కలుగుతుంది. ఆమె ప్రశ్నించే యువతిగా ఎదుగుతుందని ఆశ పడతారు. అంతేగాక బహుశా ఆమె ఇప్పుడు ఉన్న వ్యవస్థను కూడా అధిగమించే అవకాశముంటుందని ఆశావహంగా ప్రేక్షకులు భావిస్తారు! చిన్నారి హసన్ ఏదో ఒక రోజు తన భార్య స్వాతంత్ర్యంపై కోపంతో సైకిల్ రేసు నుండి ఆమెను వెంబడించే వ్యక్తిగా ఎదుగుతాడా? ఇది ఊహించలేనట్లుగా ఉంది, కానీ ఇప్పుడైతే హావాని తనతో సమానంగా భావిస్తున్నాడు. కానీ అతను ఎదిగే సమయానికి మతోన్మాదం, మూర్ఖత్వ అంచనాలు తగ్గుతాయా? అంతిమంగా ఈ చలనచిత్రంలో ప్రధాన సమస్య మహిళల సమానత్వ సాధనే!

భారీ స్పందన

ఈ సినిమాకు వచ్చిన విమర్శకుల స్పందన చాలా ప్రశంసనీయమైనది. ఫిల్మ్ రివ్యూస్ సైట్ రాటెన్ టొమాటోస్ 59 రివ్యూల ఆధారంగా దీనికి 88% స్కోర్‌ నిచ్చింది. న్యూయార్క్ టైమ్స్‌ కి రాసిన స్టీఫెన్ హోల్డెన్ దీనిని “స్టన్నర్ ఆఫ్ ఫిల్మ్” గా వర్ణిస్తూ “ఆశ్చర్యకరమైన తొలి దర్శకత్వ ప్రతిభ” అని పేర్కొన్నాడు. పలువురు సినీ పండితులు “తీవ్రంగా ప్రేరేపింపజేసే చిత్రనిర్మాణం” గానే గాక “ఫెల్లినిస్క్”గా అభివర్ణించారు. మహ్మద్ అహ్మదీ ఇబ్రహీం గఫోరి రెండవ కథలో రేస్ - రోడ్‌ సైడ్ - సముద్రం మధ్య ప్రత్యామ్నాయంగా ధ్వనించే సైకిల్ బెల్స్ సౌండ్ ఎడిటింగ్‌తో డైనమిక్ సినిమాటోగ్రఫీ అత్యంత అద్భుతంగా రూపొందించి విశ్వవ్యాప్తంగా చిరస్మరణీయం చేశారని సినీప్రియులు కొనియాడారు. కొంతమంది దీనిని “ఫెల్లినిస్క్” అని పిలవడంతో సానుకూలమైన విమర్శలు వెల్లువెత్తాయి. 2001లో అమెరికన్ థియేటర్లలో పరిమితంగా విడుదల చేశారు. ఇరాన్‌లో విడుదలైనప్పుడు, ఇది తాత్కాలికంగా నిషేధించబడింది!

సాధించిన అవార్డులు

“ది డే ఐ బికేమ్ ఏ ఉమెన్” 2000 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ న్యూ డైరెక్టర్స్/న్యూ ఫిల్మ్స్ ఫెస్టివల్‌తో సహా అనేక ఫెస్టివల్స్‌ లో ప్రదర్శించబడి అనేక అవార్డులను గెలుచుకుంది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, థెస్సలోనికి (Thessaloniki-Greece) ఫిల్మ్ ఫెస్టివల్, బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, సౌత్ ఫెస్టివల్, చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ఓస్లో ఫిల్మ్స్‌ లో ప్రతిష్టాత్మక ICFT-UNESCO "ఎన్రికో ఫుల్చిగ్నోని అవార్డు" గెలుచుకుంది.

శివలక్ష్మి

చిత్ర సమీక్షకురాలు, రచయిత

94418 83949

Next Story