- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను స్త్రీగా మారిన రోజు! - 1
2000 సంవత్సరంలో, పర్షియన్ భాషలో వచ్చిన ఇరానియన్ డ్రామా చిత్రం “The Day I became A Woman”.

“The Day I became A Woman” (ఒకటో భాగం)
2000 సంవత్సరంలో, పర్షియన్ భాషలో వచ్చిన ఇరానియన్ డ్రామా చిత్రం “The Day I became A Woman”. ఇరాన్ లోని బాల్య, యవ్వన, వృద్ధాప్య దశలలోని ముగ్గురు కథానాయికల కథలను విడి విడిగా చిత్రీకరించిన మూడు లఘుచిత్రాల త్రయం ఇది. ఈ చిత్ర దర్శకురాలు మార్జీహ్ మెష్కిని (Marzieh Meshkini). దీని నిడివి ఒక గంటా 14 నిమిషాలు. దర్శకురాలు మార్జీహ్ మెష్కిని, ఆమె భర్త మొహసేన్ మఖ్మల్బాఫ్ (Mohsen Makhmalbaf) తో కలిసి ఈ చిత్ర రచనలో పాలు పంచుకున్నారు.
ఇతివృత్తం; “ది డే ఐ బికేమ్ ఎ ఉమన్” ఇరాన్ మహిళల విభిన్న దశలలోని జీవన స్థితిగతులను వర్ణిస్తుంది. బాల్యం నుంచి కౌమారదశలో ప్రవేశించబోతున్న ఒక బాలిక, పురుషాధిపత్యపు వలలో చిక్కుకుని తన భర్త నుంచి విముక్తిని కోరుకునే ఒక యువతి, పితృస్వామ్య సమాజం నుంచి స్వేచ్చను కోరుకుంటూ తనకోసం తాను జీవించాలే తప్ప తనను ఎవరూ పాలించకూడదని నిర్ణయించుకున్న ఒక సంపన్నవితంతువు-ఇలా తమ తమ గుర్తింపుల కోసం పోరాడుతున్న ఈ ముగ్గురి స్త్రీల కథలనూ చాలా సూటిగా, హృద్యంగా దృశ్యమానం చేస్తుంది దర్శకురాలు మార్జీహ్ మెష్కిని!
మొదటి కథ “హవా”; ఇందులో హవా అనే ఒక బాలిక తన చిన్నతనం నుంచి హసన్ అనే ఒక అనాధ బాలుడితో స్వేచ్ఛగా ఆడుకుంటూ ఉంటుంది. హసన్ ఒక్కడే గాకుండా ఇంకా కొంతమంది నల్లజాతి బాలురితో స్నేహంగా ఉంటుంది. కానీ హఠాత్తుగా ఆమె తొమ్మిదవ పుట్టినరోజు నుంచి వారి ఇస్లాం మతాచారం ప్రకారం “ఆమె ఒక స్త్రీగా మారబోతుంది” కాబట్టి, హవా తన జుట్టును స్కార్ఫ్(హిజాబ్)తో కప్పుకోవాలని, ఇకపై ఆమె అబ్బాయిలతో కలిసి ఆడకూడదనీ, మరి ముఖ్యంగా ఆమె బెస్ట్ ఫ్రెండ్, హసన్ అనే నల్లజాతి అబ్బాయితో ఆడకూడదు” అని హవా అమ్మమ్మ ఆదేశిస్తుంది. హసన్, హవా ఇంటిముందుకొచ్చి, ఆడుకుందామని, ఐస్క్రీం తిందాం రమ్మని రెండు మూడుసార్లు పిలుస్తాడు. హవా అమ్మమ్మ హసన్ ని కసిరికొట్టి “హవా రాదు వెంటనే ఇక్కడినుంచి పొమ్మ” ని కఠినంగా చెప్తుంది. అతను విచారంగా వెనుదిరగడంతో, హవా దిగ్భ్రాంతి చెంది, తన నిరసనను ప్రదర్శిస్తుంది.
హవా తల్లి తాను బజారు నుంచి కొన్న నల్లని వస్త్రాన్ని హవా సైజుకి హిజాబ్ కుట్టి ఆమె తలమీద కప్పుతుంది. హవా మధ్యాహ్నం జన్మించిందని, ఆమె స్త్రీగా మారడానికి ఇంకా సమయం కాలేదని అమ్మమ్మని తెలివిగా ఒప్పించి, తన స్నేహితుడితో చివరిసారిగా కలిసి, వెంటనే వచ్చేయమని అనునయంగా హవాకి చెప్పి వెళ్ళడానికి అనుమతిస్తుంది వాళ్ళమ్మ. కానీ అమ్మమ్మ అమ్మలు ఒక షరతు పెడతారు. ఒక కర్రను నిటారుగా నేల మీద నిలిపి దాని నీడను చూసుకుంటూ, ఆ నీడ పూర్తిగా అదృశ్యమయ్యే సమయానికి తిరిగి ఇంటికి వచ్చేయాలని ఆదేశిస్తారు. హవా పరుగులు తీస్తూ, హసన్ ఉన్న చోటుకి చేరుకునే సమయానికి, అతన్ని టీచర్ హోంవర్క్ చేయమని బంధించి ఉంచుతుంది. హవాని షాపుకెళ్ళి ఐస్క్రీం కొని తెమ్మంటాడు హసన్. హవా మళ్ళీ పరుగులు తీస్తూ ఐస్క్రీం లేదని, లాలీపప్ తెచ్చానని చెప్తుంది. నిరాశ చెందిన ఇద్దరు స్నేహితులు నిస్సహాయంగా ఖైదు చేయబడిన అతని కిటికీలోని జైలులాంటి ఇనుపచువ్వల మధ్యనుంచి లాలిపాప్ ఒకరి తర్వాత ఒకరు పంచుకుని తింటారు. మధ్యాహ్న సమయానికి నీడ కర్రతో సమలేఖనం అవుతుంది కాబట్టి భూమిలోకి దించిన కర్ర సమయాన్ని సూచిస్తుంది. హవా తన చిన్నతనపు చివరి ఘడియను సద్వినియోగం చేసుకోవడంకోసం ఆమెచేసిన హడావిడి పరుగుల కార్యకలాపాలను ఈ చిత్రం చూపిస్తుంది. అరమరి కలు లేని ఆ పసివయసు స్నేహాన్ని ప్రేక్షకులు మురిపెంగా చూస్తారు! హవా పరుగుల్నీ, హాసన్ తో పుల్లగా ఉన్న లాలీపాప్ ని చప్పరిస్తూ పంచుకునే సమయంలో కాకి ఎంగిలి చేస్తూ హాసన్ కి ఇచ్చే నటనతో కూడా ప్రేక్షకులు బాగా ఆనందిస్తారు.
రెండవ కథ “ఆహూ”; ఈ కథలోని కథానాయకురాలి పేరు కూడా ఆహూ. ఇది మొదట అధివాస్తవికంగా కనిపించే దృశ్యీకరణతో ప్రారంభమవుతుంది. కానీ ఆహూ ఆచరణమాత్రం కార్యసాధక నిమగ్నతలో ఉంటుంది. తలనుండి కాలివరకు నల్లటి దుస్తులు ధరించిన ఒక స్త్రీల సమూహం, ఆవేశంగా తమ సైకిళ్లను సముద్రం పక్కనే ఉన్న రహదారిలో తొక్కుతుంటారు. అది మహిళల సైకిల్ పందెం. ఒక యువకుడు గుర్రంపై దూసుకుపోతూ, ఆహూ అంటూ బిగ్గరగా పిలుస్తూ, జంతువులు పక్షులను బెదరగొడుతూ, సమస్త జీవులను భయానికి గురిచేస్తూ క్రూఫీ మైదానంలో గజిబిజిగా దూసుకుపోతూ కనిపిస్తాడు. ఒక ఇరుకైన సముద్రతీర రహదారి వెంట మెరుపుతీగల్లా వేగంగా పెడ్లింగ్ చేస్తున్న మహిళా సైకిలిస్టుల పెద్ద సమూహం వైపు అతను తన బైక్ ని దూకుడుగా నడుపుతూ ఆహూ దగ్గరికి వచ్చి ఆగుతాడు. అతను ఆమె భర్త అని ప్రేక్షకులకు తెలుస్తుంది! ఆమె సైకిల్ పందెంలో పాల్గొనడం అతనికి సుతరామూ ఇష్టంలేదు. ఆహూని బైక్‌నుంచి వెంటనే దిగమని హూంకరిస్తూ ఇంటికి తిరిగి రమ్మని ఆజ్ఞాపిస్తాడు.
ఆహూ అతని వైపుకి కూడా తన చూపుని మరల్చకుండా సూటిగా చూస్తూ, స్వేచ్ఛను తెలిపే ఉత్కృష్టమైన ధిక్కార స్వరంతో రాదలచుకోనట్లుగా ఆమె “రాను” (No) అని చెప్తుంది. ఇక చేసేదేమీ లేక అతను అప్పటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడే గుర్రపు స్వారీచేస్తున్న ఉస్మాన్ అనే ఒక ముల్లాతో తిరిగి వచ్చి విడాకులు తీసుకుంటానని బెదిరిస్తాడు. ఆహూ అదరదు, బెదరదు. ఆ మతాచార్యుడు ముల్లా ఆహూ తన సైకిల్ ని వెంటనే వదిలి రావాలని, ఆమె నడిపేది సైకిల్ కాదనీ అది ఒక “డెవిల్స్ మౌంట్” అని అతను రకరకాలుగా ఆమెకు నచ్చజెప్పాలని చూస్తాడు. ఆహూ గానీ సైకిల్ వెంటనే దిగకపోతే అక్కడికక్కడే ముల్లాతో తక్షణం విడాకుల ఏర్పాటు చేస్తానని బెదిరిస్తాడు భర్త. ఆమె సూటిగా చూస్తూ, “సరే” (yes) అని స్థిరంగా చెప్తుంది. ఆహూ బైక్‌ల మధ్యనుంచి వేగంగా ముందుకు సాగి, ఆ తర్వాత నెమ్మదించి వెనుక పడిపోవడంతో, ఆమెను బైక్‌పై నుండి బలవంతంగా తీసుకెళ్లి కుటుంబానికి, ఆమె తెగకు తిరిగి అప్పగించడానికి గుర్రాలతో వెంటబడుతున్న సైనికులు కనిపిస్తారు. మొదట నలుగురైదుగురుగా కనిపించే గుర్రపుస్వారీ చేసే సైనికుల సంఖ్య క్రమంగా పెరుగుతూ అనేకమంది గిరిజన మతాధికారులు, ఆమె తండ్రి, సోదరులు ఆహూని వెంబడిస్తూ, తరుముకుంటూ రావడం కనిపిస్తుంది. ఆమె స్త్రీలకు విధించిన అంతులేని సామాజిక బంధనాలనుండి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది.
మూడవ కథ “హూరా”; ఈ కథ కూడా అదే పేరుగల ఒక వృద్ధవితంతు మహిళది. ఇది ఒక నిశ్శబ్ద కామెడీ లాగా ప్రారంభమవుతుంది. పక్షిలాగా అప్రమత్తంగా ఉన్న ఒక బాలుడు ఒక వృద్ధమహిళ ఉన్న వీల్ చైర్‌ను నెడుతుంటాడు. రిఫ్రిజిరేటర్, టీవీ, టేబుల్‌లు, కుర్చీలు వంటి వస్తువులను కొనుగోలు చేసే షాపుల్లోకి బాలుడు ఆమెని తీసికెళతాడు. తర్వాత అనేక వినియోగవస్తువులతో నిండిన బండ్లను నడపడానికి ఆమె అనేకమంది బాలురను నియమించు కుంటుంది. ఆమె చాలా డబ్బును వారసత్వంగా పొందిందని, ఆమె ఎంత ఖర్చు చేయగలిగితే అంత ఖర్చు చేయడానికి ఆమె ప్లాన్ చేసుకుందని ప్రేక్షకులకు తెలుస్తుంది. ఆమెకు వివాహమై ఎన్నో సంవత్సరాలయినప్పటికీ ఏ వస్తువునూ తనకోసమంటూ కొనుక్కోలేకపోయిందనీ, అసలు ఆమె తనకోసం తాను బతకడం మర్చిపోయిందని కూడా ప్రేక్షకులకు అర్ధమవుతుంది. ఆమె వాస్తవంగా తనకు సంక్రమించిన ఆస్తులతో “నాకు ఎన్నడూ లేని వస్తువులన్నీ ఇప్పుడు నా కోసం కొనుక్కుంటాను” అనుకుంటుంది. తాజాగా కొనుగోలు చేసిన అనేక వస్తువులతో సముద్రతీరానికి వెళ్తుంది.
హూరా కథ, ఆధునిక జీవితంలోని విచిత్రమైన పార్శ్వాలను అన్వేషించిన ఫెడెరికో ఫెల్లిని, జాక్వెస్ టాటి లాంటి ఇతరుల చలనచిత్రాలను గుర్తుచేసే అధివాస్తవిక గుణాలను కలిగి ఉంటుంది. టైటిల్ క్యారెక్టర్ హూరా, ఉన్నతస్థాయి షాపింగ్ కోసం ఆమెకు సంక్రమించిన ఆస్తిమొత్తాన్నీ నగదు రూపంలో తెచ్చుకుని, అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయాలనే ప్రణాళికతో, ఒక విధమైన షాపింగ్ లిస్ట్ గా ఎక్కడ ఏ వస్తువుని మార్చిపోతానో అన్నట్లు విచిత్రంగా ఒకో వస్తువుకి గుర్తుగా ఒకో గుడ్డపీలికను వేళ్లకు చుట్టుకుని కిష్ విమానాశ్రయం నుంచి సరాసరి షాపింగ్ మాల్ లకు బయలుదేరుతుంది. పిల్లలు హూరా కొత్త ఆస్తులను, సుదూర ఓడ వైపు, హవా స్నేహితుడు తయారు చేసిన చిన్న ఆయిల్-డ్రమ్ బోట్‌లను ఉపయోగించి, ఉపయోగిస్తున్నందున, సినిమా అన్నింటికంటే అస్పష్టమైన గమనికతో ముగుస్తుంది.
శివలక్ష్మి
చిత్ర సమీక్షకురాలు, రచయిత
94418 83949






