సింగరేణిలో బొగ్గు మాయమైందనేది పూర్తిగా అవాస్తవం : సుంకర మధుసూదన్

by Batti.Sumithra |

సింగరేణిలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో బొగ్గు చోరీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రామగుండం 3 ఏరియా జీఎం సుంకర మధుసూదన్ అన్నారు.

సింగరేణిలో బొగ్గు మాయమైందనేది పూర్తిగా అవాస్తవం : సుంకర మధుసూదన్
X

దిశ, రామగిరి : సింగరేణిలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో బొగ్గు చోరీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రామగుండం 3 ఏరియా జీఎం సుంకర మధుసూదన్ అన్నారు. ఇలాంటి ఆరోపణలు సంస్థ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్జీ3 జీయం కార్యాలయంలో విలేకరులతో సమావేశంలో నిర్వహించారు. జీయం మాట్లాడుతూ సింగరేణి అనేది మైనింగ్ రంగంలో 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థ. దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తూ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

ఈ నేపథ్యంలో సింగరేణిలో అమలులో ఉన్న బొగ్గు రవాణా, భద్రతా వ్యవస్థలు, సాంకేతిక పర్యవేక్షణ విధానాల గురించి వెల్లడించారు. ఉత్పత్తి అయ్యే బొగ్గులో సుమారు 85 శాతం రైల్వే మార్గం ద్వారా, మిగిలిన 15 శాతం రోడ్డు మార్గం ద్వారా వినియోగదారులకు సరఫరా చేయబడుతోందన్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారునికి చేరే వరకు‌ ప్రతి టన్ను బొగ్గు ఆర్ఎఫ్ఐడీ, జీపీఎస్, సీసీ టీవీ , కోల్ నెట్, ఎలక్ట్రానిక్ వెయిబ్రిడ్జులు, సింగరేణి సెక్యూరిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు, హోలోగ్రామ్ చలానాలు, టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణ వంటి బహుళస్థాయి సాంకేతికత భద్రతా వ్యవస్థల మధ్య నిర్వహించబడుతోందని వివరించారు. అందువల్ల బొగ్గు మాయమవడం లేదా చోరీ జరిగింది అనే ఆరోపణలను ఆర్జీ 3 జీయం ఖండించారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story