విశాఖ రైల్వేజోన్ ​ప్రకటనలో కేంద్రం కొత్త ఫిట్టింగ్.. అది ఇస్తే.. ఇది ఎత్తేస్తారా?

by Disha Web Desk 19 |
విశాఖ రైల్వేజోన్ ​ప్రకటనలో కేంద్రం కొత్త ఫిట్టింగ్.. అది ఇస్తే.. ఇది ఎత్తేస్తారా?
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్‌ ఏర్పాటు కావాలన్నది ఉత్తరాంధ్ర ప్రజలకు దశాబ్దాల కల. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌తో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉన్నా, రైల్వే జోన్‌కు ఓకే చెప్పిన కేంద్రం.. వాల్తేరు డివిజన్‌ ఉండదని మెలిక పెట్టింది. వాల్తేరు డివిజన్‌కు దాదాపు 129 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు అనంతరం వాల్తేరు డివిజన్‌ కనుమరుగు కానుంది. విశాఖకు జోన్‌ వచ్చినా, వాల్తేరు డివిజన్‌ ద్వారా వచ్చినంత ఆదాయం మాత్రం రాదు.

సౌత్‌ రైల్వే జోన్‌కు కట్టుబడి ఉన్నాం : రైల్వే మంత్రి

ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాల్సిందే అంటూ అన్ని వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే దీనికోసం రూ.170 కోట్లు కేటాయించినట్టు చెప్పింది. వైజాగ్ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదనలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అలాగే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ప్రధాన హెడ్ ఆఫీస్ భవనాల నిర్మాణానికి భూమి కూడా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అలాగే భూ సర్వే, ఆఫీస్ లే అవుట్, సిబ్బంది క్వార్టర్స్, ఇతర నిర్మాణ పనులకు సంబంధించిన కార్యకలాపాలు మొదలుపెట్టాలని ఇప్పటికే అధికారులకు సూచించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రం కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు మంత్రి తెలిపారు. 2019లో ఫిబ్రవరి 27న ఆంధ్ర రాష్ట్రానికి సౌత్ రైల్వే జోన్ ప్రకటించారనీ, రైల్వే జోన్ అంశం ఆచరణలోకి ఎప్పుడు వస్తుందనీ.. అసలు రైల్వే జోన్ ఏర్పాట్లు జరుగుతున్నాయా అని రైల్వే మంత్రిని ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఇప్పటికే సంబంధిత భవనాల నిర్మాణానికి కావాల్సిన స్థలం, డీపీఆర్ వంటి పనులు జరుగుతున్నాయని త్వరలోనే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.

కేకే లైన్‌ నుంచే అధిక ఆదాయం..

వాల్తేరు డివిజన్‌ ద్వారా తూర్పు కోస్తా రైల్వేకు సంవత్సరానికి రూ.7 వేల కోట్ల ఆదాయం రాగా, ఎక్కువగా కేకే లైన్‌ (కొత్తవలస-కిరండోల్‌) నుంచే వస్తోంది. ఈ డివిజన్‌లో ఆంధ్రప్రదేశ్ పరిధి 516 కి.మీ., ఒడిశా పరిధి 421 కి.మీ., ఛత్తీస్‌గఢ్ పరిధి 170 కి.మీ. ఉంది. ఇందులో అత్యధిక భూభాగం ఏపీలో ఉండగా, ఆదాయం మాత్రం ఒడిశా, ఛత్తీస్‌గ‌ఢ్‌ల నుంచి వస్తుంది. ఇందువల్లే ఆయా ప్రాంతాలను ఒడిశా తూర్పు కోస్తాలోనే ఉంచాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో ఒడిశా ఒత్తిళ్లకు తలొగ్గి, వాల్తేరు డివిజన్‌ను విభజించి, అధిక ఆదాయం వస్తున్న ప్రాంతాలను ఒడిశాకు అప్పగించేందుకు సిద్ధమయ్యింది. దీనికోసం ప్రత్యేకంగా రాయగడ డివిజన్‌ ఏర్పాటు చేసి వాల్తేరు డివిజన్‌లోని మిగిలిన ప్రాంతాలను సైతం అందులో కలిపేందుకు ఒడిశా ప్రయత్నాలు మెుదలుపెట్టింది.

ఆదాయానికి భారీ గండి..

వాల్తేరు డివిజన్‌‌ను రాయగడ‌తో కలుపుతూ సరికొత్త డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం చెబుతుంది. ఇది ఏపీకి నష్టం చేకూర్చే నిర్ణయమనే ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వాల్తేర్ డివిజన్‌లో దువ్వాడ -విశాఖపట్నం -పలాస, విజయనగరం -సింగాపురం రోడ్ -తేరుబలి, కొత్తవలస -కిరండోల్‌, కోరాపుట్‌-రాయగడ‌, కొత్తవలస- సింహాచలం‌, బొబ్బిలి-సాలూరు‌, నౌపాడ-గుణపూరు లాంటి ప్రధాన లైన్లు ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 1052 కిలోమీటర్లు. అంతే కాక ఇవన్నీ రవాణాపరంగా, పారిశ్రామికంగా‌, పర్యాటక పరంగా అత్యంత కీలకమైన రూట్లు. వీటి ద్వారా జరిగే రవాణా వల్ల వచ్చే ఆదాయంలో అధికభాగం రాష్ట్రానికి చెందాల్సి ఉండగా, ఇప్పుడు ఈ డివిజన్‌ను రాయగడ‌తో కలిపేయడం వల్ల రాష్ట్రం ఈ మొత్తాన్ని కోల్పోనుంది.

ఆ అవసరమే లేదు..

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా మాత్రమే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కానీ వాల్తేరు డివిజన్‌ను తొలగించాల్సిన అవసరమే లేదు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రైల్వే జోన్లను కేటాయించరు. పైగా ఒక జోన్‌లో ఇతర రాష్ట్రాల ప్రాంతాలతో కూడిన డివిజన్‌లు కూడా ఉంటాయి. కానీ ఒడిశా ఒత్తిళ్ల కారణంగా, కేంద్రం వాల్తేరు డివిజన్‌ను నిర్వీర్యం చేస్తోంది. విశాఖ జోన్‌ ఏర్పాటును మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న ఒడిశాను సంభాళించేందుకే, కేంద్రం వాల్తేర్‌ డివిజన్‌ తొలగించే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

జోన్‌ వల్ల వచ్చే లాభాలు..

రాష్ట్ర రైల్వే నెట్‌వర్క్‌ మెుత్తం తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోనే ఉన్నాయి. దీని వల్ల రాష్ట్రంలో ఏ ట్రైన్‌ నడవాలన్నా ఆయా జోన్ల నిర్ణయాలుపైనే ఆధారపడాల్సి ఉండేది. కానీ ఇప్పుడు కొత్త జోన్‌ ఏర్పడితే, ఆయా జోన్ల నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్త రైళ్లు, రైళ్ల పొడిగింపు, అదనపు బోగీల వంటి నిర్ణయాలు రాష్ట్రమే తీసుకోవచ్చు. వాల్తేరు డివిజన్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నాం కాబట్టి, ఆ ఆదాయాన్ని విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్‌ల నుంచి రాబట్టుకోవాల్సి ఉంది. కానీ ఈ ఆదాయం రాష్ట్రంలోని పోర్టులు, పరిశ్రమల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. కొత్త జోన్ ఏర్పాటుతో ఆర్‌ఆర్‌బీ ద్వారా ఉద్యోగాలను పెంచుకోవచ్చు. కానీ కొత్తగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తాకు ఈ అవకాశం ఉందా, లేదా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

వాల్తేరు రైల్వే డివిజన్‌‌‌కు కోట్లలో ఆదాయం..

వాల్తేరు రైల్వే డివిజన్‌ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.16 కోట్ల మంది ప్రయాణికుల నుంచి రూ.349.71 కోట్లు సాధించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే ఈ లక్ష్యాన్ని ఫిబ్రవరి నెలాఖరు నాటికే 1.61 కోట్ల మందిని గమ్యాలకు చేరవేసి రూ.358.01 కోట్లు ఆదాయం సాధించి పూర్తి చేసుకుంది. టికెట్‌ చెకింగ్‌ల ద్వారా ఫిబ్రవరి నెలలో 43 వేల కేసులను నమోదు చేసి రూ.2.58 కోట్ల ఆదాయం సాధించింది. సరకు రవాణాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జనవరి 10వ తేదీ నాటికి 50 మిలియన్‌ టన్నుల మార్కును దాటింది. మొత్తం 50.11 మిలియన్‌ టన్నుల సరకును రవాణా చేసింది.2020-21తో పోల్చుకుంటే ఇది 13.35 శాతం అధికం.

మాదంటే.. మాదంటూ బీజేపీ, వైసీపీ నేతల పోటీ..

ఒకపక్క కీలకలమైన వాల్తేర్ డివిజన్‌ను నష్టపోతుంటే రాష్ట్ర బీజేపీ నేతలు, వైసీపీ నాయకులు ప్రత్యేక రైల్వే జోన్ మాదంటే మాదని పోటీ పడుతున్నారు. విశాఖ రైల్వే జోన్ అనేది రాష్ట్ర ప్రజ‌ల చిరకాల కోరిక అని అన్నారు. ప్రజ‌ల కోరిక బీజేపీతోనే సాధ్యమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుందనీ, అందువల్లే ఏపీకి దక్కాల్సినవి దక్కడం లేదంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎంపీల కృషితోనే ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ వస్తుందనీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రస్తుతం వైసీపీ ఎంపీగా విశాఖపై దృష్టి సారించిన విజయసాయిరెడ్డి, వాల్తేర్ డివిజన్‌ను నష్టపోతున్నా దానిపై నోరు మెదపడం లేదని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి.

వర్క్ షాప్ కేటాయింపులు రూ. 560 కోట్లకు పెంపు..

2013-14లో రూ.110 కోట్లతో మంజూరు చేసిన కర్నూలు కోచ్ మిడ్ లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్ షాప్ కేటాయింపులను తాజాగా రూ. 560. 72 కోట్లకు పెంచినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.178. 35 కోట్లు కేటాయించి రూ.171.2 కోట్లు ఖర్చుచేసినట్లు వెల్లడించారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 7 ఎకరాలు భూ సేకరణలో ఆలస్యం చేస్తుండటంతోనే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని ఆయన వివరించారు. లాక్‌డౌన్‌ వల్లా పనులు తీవ్రంగా ప్రభావితమయ్యాయనీ, ఎల్‌హెచ్‌బీ కోచ్ లను ఎప్పటికప్పుడు ఇక్కడ ఓవరాలింగ్ చేయనున్నట్లు మంత్రి వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేదు.. పనులు ఆపేశాం

కడప-బెంగుళూరు రైల్వేలైన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా డిపాజిట్ చేయకపోవడంతో ఆ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లిస్తేనే పనులు మొదలవుతాయని తేల్చి చెప్పారు. రాజ్యసభలో వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 'కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చును పంచుకోవాలన్న షరతుతో 2008-09 బడ్జెట్‌లో కడప-బెంగళూరు (268 కి.మీ.) లైను మంజూరు చేశాం. రూ.3,308 కోట్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్టు ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. 2021 మార్చి వరకు రూ. 351 కోట్లు ఖర్చుచేశాం. అందువల్ల ఈ మార్గంలో 21.30 కిలోమీటర్ల కడప- పెండ్లిమర్రి సెక్షన్ ప్రారంభమైంది. 2006 నవంబరు 15న రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మదనపల్లి మీదుగా నిర్మించే కడప- బెంగళూరు లైను ఖర్చులో 50 శాతం ఇవ్వడానికి అంగీకరించింది ఇప్పటివరకు రూ.189. 95 కోట్లే డిపాజిట్ చేసింది. ఈ ప్రాజెక్టుకయ్యే భూమి ఖర్చే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం 2020 నవంబరు 3న లేఖ రాసింది. 2021 జూన్ 17న మరో లేఖ రాస్తూ ఈ లైన్ ఎలైన్మెంటు కడప-ముద్దనూరు-ముదిగుబ్బ- శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం-బెంగళూరు మీదుగా చేపట్టాలని సూచించింది. కానీ ఇప్పటికే ఉన్న ఎలైన్‌మెంట్‌కు ఇది పూర్తిగా భిన్నమని అన్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రూ.289 కోట్లు డిపాజిట్‌ చేయాలని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. దక్షిణ మధ్య రైల్వేలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు 16,878, గెజిటెడ్ ఉద్యోగాలు 34 ఖాళీగా ఉన్నట్లు రైల్వేమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో కలిపి 3,01,414 నాన్ గెజిటెడ్, 2,519 గెజిటెడ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed