దేశం నుంచి తరిమి కొడితేనే బీజేపీకి బుద్ధి వస్తోంది : టీఆర్ఎస్

by Disha Web Desk |
దేశం నుంచి తరిమి కొడితేనే బీజేపీకి బుద్ధి వస్తోంది : టీఆర్ఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశం నుంచి తరిమికొట్టేవరకు బీజేపీకి బుద్ధిరాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలో మంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ కవితతోపాటు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. దేశ ప్రజల కోసం ప్రధాని మోదీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరలు డబుల్‌ చేసి ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి, ముబ్బడిగా ధరలు పెంచుతుందని విమర్శించారు. ఇప్పటికే కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో పేదలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి తెలంగాణకు ప్రత్యేక సబ్సిడీ ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చి దేశ జీడీపిని పెంచి, ప్రగతి సాధిస్తామని చెప్పారని... ఇప్పడు నిజంగానే గ్యాస్(జీ), డీజిల్(డీ), పెట్రోల్(పీ) ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 2014 లో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర, ప్రస్తుతం రూ.1000 కి చేరిందని... పెరిగిన రూ.600 సబ్సిడీ ఇవ్వాలని, తెలంగాణకు ప్రత్యేక సబ్సిడీ ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్డు మీద ఆందోళనలు చేసే పరిస్థితి వస్తుందనుకోలేదన్న ఎమ్మెల్సీ కవిత, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలందరూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతులు, గిరిజనుల రిజర్వేషన్లు, గ్యాస్ ధరల పెంపు విషయంలో, మొత్తం తెలంగాణను రోడ్డు మీద కూర్చోబెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అద్బుతంగా పంటలు పండినా, కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనడానికి ముందుకు రావడం లేదన్నారు. దీంతో ప్రతి గ్రామంలో రైతులు ఆందోళనలో ఉన్నారన్న ఎమ్మెల్సీ కవిత, పంజాబ్ మాదిరిగానే తెలంగాణలోనూ 100 శాతం వడ్లు కొని డబ్బులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించేందుకు తెలంగాణ ఆడబిడ్డల పక్షాన ఢిల్లీలో కొట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను ఎంపీ కవిత డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో యువత ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. 2014 నుండి ఇప్పటి దాకా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల మీద ప్రజలకు సబ్సీడి ఇవ్వకుండా ప్రభుత్వం 23 లక్షల కోట్లు దోచుకుందన్నారు ఎమ్మెల్సీ కవిత.

ప్రజా ఉద్యమాల ద్వారానే బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేయగలమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పేదలకు అందుతున్న సబ్సిడీ పక్కదారి పడుతున్న విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా తెలంగాణ యువ మిత్రులు సోషల్ మీడియా ద్వారా ఇంటింటికీ తెలియజేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed