- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్-1బీ (H-1B) వీసాలపై టెక్సాస్ గవర్నర్ సంచలన నిర్ణయం
గత కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా హెచ్-1బీ వీసాలపై సంచలన నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా హెచ్-1బీ వీసాల (H-1B visa)పై సంచలన నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత వీసాల జారీపై కఠిన ఆంక్షలు పెట్టారు. ఇది చాలదు అన్నట్లు తాజాగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వం (Texas State Government) హెచ్-1బీ వీసాల వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు కొత్తగా హెచ్-1బీ వీసా పిటిషన్లను దాఖలు చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని గవర్నర్ గ్రెగ్ అబాట్ (Governor Greg Abbott) ఆదేశించారు. ఈ నిబంధనలు మే 31, 2027 వరకు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో నడిచే సంస్థలు విదేశీయుల కంటే స్థానిక అమెరికన్ కే ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన చట్టాలను రూపొందించడానికి ఈ గడువును వినియోగించుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏదైనా ప్రభుత్వ సంస్థ, యూనివర్సిటీ అనివార్య కారణాల వల్ల విదేశీ నిపుణులను నియమించుకోవాల్సి వస్తే, టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్ నుండి ముందస్తుగా రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది.
అలాగే గత ఏడాది కాలంలో ఎన్ని హెచ్-1బీ వీసాలను స్పాన్సర్ చేశారో.. ప్రస్తుతం ఎంతమంది విదేశీయులు పనిచేస్తున్నారో పూర్తి వివరాలతో కూడిన నివేదికను మార్చి 27, 2026 నాటికి సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు. ఈ నిర్ణయం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని, ప్రైవేట్ కంపెనీలపై దీని ప్రభావం ఉండదని అధికారులు వివరించారు. అమెరికాలో భారతీయులకు ఎంతో కీలకమైన హెచ్-1బీ వీసా వ్యవస్థపై టెక్సాస్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






