- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్మడి పాలమూరు జిల్లా మున్సిపాలిటీల్లో పతాక స్థాయికి చేరిన ఉత్కంఠ
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత అసలు సిసలైన 'కుర్చీ' లాటరీ మొదలైంది. స్పష్టమైన మెజారిటీ రాని మున్సిపాలిటీల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: "గెలిచిన అభ్యర్థులు చేజారకుండా రిసార్టుల చుట్టూ గట్టి కాపలాలు.. గెలుపు గుర్రాలను పట్టం ఎక్కించేందుకు తెరవెనుక ఎక్స్ అఫీషియో ఓట్ల లెక్కలు.. వెరసి ఉమ్మడి పాలమూరు మున్సిపల్ రాజకీయం ఇప్పుడు అగ్ని పరీక్షగా మారింది. బలాబలాలు తారుమారవుతాయా? లేక క్యాంపు రాజకీయాలే పీఠాన్ని డిసైడ్ చేస్తాయా? గద్వాల గడ్డపై గెలుపెవరిది? నారాయణపేటలో కమలం వికసిస్తుందా? మహబూబ్ నగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది? ఈ నెల 16న జరిగే మున్సిపల్ కురుక్షేత్రంలో అసలు 'కింగ్' ఎవరో తేలనుంది. అనూహ్యంగా తెరపైకి వస్తున్న కొత్త పొత్తులు అభ్యర్థుల్లో గుబులు రేపుతుండగా.. హైకమాండ్ పంపే 'సీల్డ్ కవర్' లో ఎవరి పేరు ఉందోనని కేడర్‌లో ఉత్కంఠ నెలకొంది. చివరి నిమిషంలో ఎక్స్ అఫీషియో ఓట్లు తారుమారైతే సమీకరణలు పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉండటంతో నేతలంతా ప్రాణప్రదంగా అభ్యర్థులను కాపాడుకుంటున్నారు. అటు ఓటర్లు మాత్రం పట్టం కట్టేది ఎవరికో.. కుర్చీ దక్కేది ఎవరికోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు."
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ కురుక్షేత్రం ముగిసినా.. అసలు పీఠం దక్కించుకునే 'పట్టాభిషేకం' పర్వం ఇప్పుడు రసకందాయంలో పడింది. ఒక మున్సిపల్ కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు అందరి దృష్టి చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పైనే ఉంది. స్పష్టమైన మెజారిటీ రాని చోట 'ఎక్స్ అఫిషియో' ఓట్లు, స్వతంత్రుల మద్దతు కీలకంగా మారాయి. పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించి 'క్యాంపు రాజకీయం' నడుపుతున్నాయి. ఈ నెల 16న ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జిల్లా అంతటా ఉత్కంఠ నెలకొంది.
గద్వాల గడ్డపై ఎక్స్ అఫీషియో చిచ్చు!
గద్వాల మున్సిపాలిటీలో రాజకీయం మునుపెన్నడూ లేనంత ఉత్కంఠగా మారింది. ఇక్కడ మొత్తం 37 వార్డులకు గాను కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 7, స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. పీఠం దక్కాలంటే 19 మంది సభ్యుల బలం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తో పాటు ఇద్దరు స్వతంత్రులు, ఒక ఎంఐఎం సభ్యుడిని కలుపుకుని 19 మందితో సేఫ్‌గా క్యాంపుకు వెళ్లిపోయింది. అయితే, బీఆర్ఎస్-బీజేపీ ఇక్కడ అనూహ్యంగా చేతులు కలిపేలా కనిపిస్తున్నాయి. నలుగురు ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేర్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే, ఎలక్షన్ కమిషన్ కొత్త నిబంధనల ప్రకారం.. సదరు మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు ఉంటేనే ఎక్స్ అఫీషియో ఓటు వేసే వీలుంటుంది. అదే నిజమైతే ఇక్కడ హస్తం పార్టీకి అధికారం దక్కడం ఖాయం.
అలంపూర్, అమరచింత, నారాయణపేటలో 'కింగ్' ఎవరు?
అలంపూర్: ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 5 స్థానాలు గెలుచుకుని సమానంగా ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఎక్స్ అఫీషియో ఓట్ల కారణంగా ఇక్కడ గులాబీ జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అమరచింత: ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు (బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, బీజేపీ 3, స్వతంత్రుడు 1). మంత్రి శ్రీహరి ఎక్స్ అఫీషియో ఓటు వేసినా కాంగ్రెస్‌కు సరిపోవడం లేదు. దీంతో బీఆర్ఎస్-బీజేపీ కలిసి ఇక్కడ జెండా పాతేందుకు సిద్ధమయ్యాయి.
నారాయణపేట: 24 స్థానాల్లో బీజేపీ 12 గెలిచి అత్యధిక స్థానాలు దక్కించుకుంది. ఇక్కడ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్ల దరఖాస్తుతో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ మద్దతు బీజేపీకే ఉండే ఛాన్స్ ఉండటంతో ఇక్కడ కమలం వికసించేలా ఉంది.
పాలమూరు కార్పొరేషన్.. మేయర్ పీఠం పై ఇద్దరి పోటీ!
మహబూబ్ నగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ సేఫ్‌గా ఉంది. 60 స్థానాల్లో 29 గెలిచిన కాంగ్రెస్, నలుగురు స్వతంత్రుల చేరికతో 33 కి చేరుకుంది. అయితే మేయర్ పదవి కోసం ప్రసన్న ఆనంద్ గౌడ్, రమా శ్రీనివాస్ రాజు మధ్య గట్టి పోటీ నడుస్తోంది. అధిష్టానం ఎవరి పేరును సీల్డ్ కవర్‌లో పంపుతుందోనని క్యాంపులో ఉన్న అభ్యర్థులు టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు.
రిసార్టుల నుంచే రణరంగంలోకి..
మెజారిటీ ఉన్నా లేకున్నా.. సభ్యులు చేజారకుండా పార్టీలు తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నెల 16న బాధ్యతల స్వీకరణ ఉండటంతో అభ్యర్థులు నేరుగా క్యాంపుల నుంచే మున్సిపాలిటీలకు చేరుకోనున్నారు. అప్పటి వరకు సమీకరణలు ఎలా మారుతాయోనని ఓటర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు.






