- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్వాల ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన
విద్యార్థిని ఇందు మృతికి కారణమైన వైద్యుల నిర్లక్ష్యం పై నిరసన ఉధృతమైంది.

దిశ, గద్వాల క్రైమ్: విద్యార్థిని ఇందు మృతికి కారణమైన వైద్యుల నిర్లక్ష్యం పై నిరసన ఉధృతమైంది. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆసుపత్రి ముందు ఉన్న ప్రధాన రహదారిపై కూర్చుని నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసన కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలు స్తంభించి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎర్రవల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఇందు, అపెండిక్స్ నొప్పితో శుక్రవారం రాత్రి 10:00 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ రాత్రంతా నామమాత్రపు చికిత్స మాత్రమే అందించారు. శనివారం మధ్యాహ్నం 2:00 గంటలకు ఆపరేషన్ కోసం తీసుకెళ్లి, సక్సెస్ అయిందని వైద్యులు తెలిపారు. కానీ పేషెంట్‌ను చూపించకుండా బీపీ పెరుగుతోందని సాకులు చెబుతూ కాలయాపన చేసి, చివరకు సాయంత్రం 6:00 గంటలకు బాలిక మృతి చెందినట్లు వెల్లడించారు.
విషయం బయటకు రాకుండా రాత్రి 8:00 గంటలకే అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామానికి పంపే ప్రయత్నం చేయగా, స్థానికులు అంబులెన్స్‌ను అడ్డుకుని తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న ఈ ఆందోళన ఆదివారం ఉదయానికి తీవ్ర రూపం దాల్చింది. నిర్లక్ష్యం వహించిన వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని, వారి లైసెన్సులు రద్దు చేయాలని నినాదాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా అక్కడికి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు.






