దావోస్‌లో తెలంగాణ తొలి విజయం.. ‘ఫ్యూచర్ సిటీ’లో భాగస్వామి కానున్న UAE

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-20 13:44:23  IST  )

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ తొలి విజయం సాధించింది.

దావోస్‌లో తెలంగాణ తొలి విజయం.. ‘ఫ్యూచర్ సిటీ’లో భాగస్వామి కానున్న UAE
X

దిశ, వెబ్‌డెస్క్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ (Davos)లో వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో తెలంగాణ తొలి విజయం సాధించింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆర్థిక మంత్రి హెచ్ఈ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ (India Future City) అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి యూఏఈ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ భేటీలో సీఎం రేవంత్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలో నిర్మించనున్న ‘ఫోర్త్ సిటీ’ ప్రాజెక్టును వివరంగా వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా రూపొందుతున్న ఈ నగరం భారత్ గర్వించదగ్గ ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విశేషాలను తెలుసుకున్న యూఏఈ ప్రతినిధులు, నగరాభివృద్ధిలో తమ దేశానికి ఉన్న అనుభవాన్ని మరియు సాంకేతికతను తెలంగాణతో పంచుకోవడానికి ఆసక్తి చూపారు. ఈ భేటీ కేవలం చర్చలకే పరిమితం కాకుండా, ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, యూఏఈ ప్రభుత్వాల ఉన్నతాధికారులతో కూడిన ఒక సంయుక్త టాస్క్‌ఫోర్స్‌ (Joint Task Force) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ టాస్క్‌ఫోర్స్ పెట్టుబడుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ రూపకల్పన ఇతర మౌలిక సదుపాయాల అంశాలను సమన్వయం చేయనున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ రైజింగ్ - 2047

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 (Telangana Rising-2047) విజన్ డాక్యుమెంట్‌ను మంత్రి అబ్దుల్లాకు వివరించారు. రాబోయే 25 ఏళ్లలో తెలంగాణను ప్రపంచ ఆర్థిక హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా మౌలిక సదుపాయాలు, ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. ఇవాళ జరిగిన ఈ కీలక భేటీ తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడులను తీసుకురావడంతో పాటు హైదరాబాద్ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో మరింత పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది.

Similar News : తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి.. దావోస్‍లో కీలక చర్చలు

Next Story