సీఎం రేవంత్‌ రెడ్డి.. డ్రీమ్‌ ప్రాజెక్టుకు తొలి అడుగు

by Batti.Sumithra |

తెలంగాణ విద్యా రంగంలో నూతన అధ్యాయం. సీఎం రేవంత్‌ రెడ్డి కలల ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతోంది.

సీఎం రేవంత్‌ రెడ్డి.. డ్రీమ్‌ ప్రాజెక్టుకు తొలి అడుగు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : తెలంగాణ విద్యా రంగంలో నూతన అధ్యాయం. సీఎం రేవంత్‌ రెడ్డి కలల ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వంద తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి సైతం బుధవారం నాంది పలుకుతోంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల ఇందుకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడ కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను బుధవారం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు సీఎం ఆరుట్ల గ్రామానికి చేరుకుంటారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ పైలాన్‌‌ను ఆవిష్కస్తారు. అనంతరం ఇక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. పోలీసు శాఖ సైతం పటిష్ట బందోబస్తు చర్యలను చేపడుతోంది.

విద్యార్థులతో బ్రేక్‌ ఫాస్ట్..

పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి పాఠశాలలో అత్యాధునికంగా తీర్చిదిద్దిన డిజిటల్‌ క్లాస్ రూమ్స్‍, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్‍, డ్రైవింగ్‌ హాల్‌, క్రీడా మైదానాలను పరిశీలిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్‌ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్‌ ఫాస్ట్ చేస్తారు. ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఆరుట్లలో సీఎం ప్రారంభిస్తున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.

డ్రోన్ల ఎగిరివేతపై నిషేధం..

ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి వస్తుండడంతో మంచాల పోలీస్ స్టేషన్‌ పరిధిలో డ్రోన్ల ఎగిరివేతపై పోలీస్ శాఖ నిషేధం విధించింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్‌ కంట్రోల్‌ మైక్రో-లైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ల ఎగరవేతను బుధవారం పూర్తిగా నిషేధిస్తూ ఫ్యూచర్‌ సిటీ పోలీస్ కమిషనర్‌ తరుణ్‌ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులో హెచ్చరికలు జారీ చేశారు.

Next Story